Begin typing your search above and press return to search.

రీల్ శంకర్ దాదాను మించిపోయేలా రియల్ శంకర్ దాదా..

By:  Tupaki Desk   |   1 Oct 2019 10:04 AM GMT
రీల్ శంకర్ దాదాను మించిపోయేలా రియల్ శంకర్ దాదా..
X
కొన్నేళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా గుర్తుందా? దందా చేసే వ్యక్తి డాక్టర్ గా చెలామణీ కావటం తెలిసిందే. బాలీవుడ్ లో బంపర్ హిట్ అయిన ఈ సినిమాను తెలుగులో తీసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను చూసి స్ఫూర్తి పొందాడో ఏమో కానీ.. యూపీకి చెందిన ఒక వ్యక్తి నకిలీ సర్టిఫికెట్లతో వైద్యుడి అవతారం ఎత్తాడు.

డాక్టర్ అని చెప్పుకుంటూ వైద్యం చేయటమే కాదు.. ఏకంగా 70వేల సర్జరీలు చేసిన ఇతగాడి అసలు భాగోతం బయటకు వచ్చి షాకింగ్ గా మారింది. గడిచిన పదేళ్లలో వేలాది సర్జరీలు చేసిన ఇతగాడి పేరు ఓంపాల్ శర్మ. సహరన్ పూర్ కు చెందిన ఇతను ఆర్. రాజేశ్ అనే వ్యక్తి ఎంబీబీఎస్ సర్టిఫికెట్లను తనకు చెందినవిగా మార్ఫింగ్ చేశాడు. అదెలా సాధ్యమైందంటే.. డాక్టర్ రాజేశ్ మంగళూరులోని ఒక వైమానిక దళానికి చెందిన ఆసుపత్రిలో వైద్యుడిగా పని చేసేవాడు. అదే ఆసుపత్రిలో ఓంపాల్ శర్మ పారామెడికల్ సేవల్ని అందించేవాడు. డాక్టర్ రాజేశ్ తో మంచి సంబంధాలు ఉన్నాయి.

దీంతో ఆయన సర్టిఫికేట్లను సంపాదించగలిగాడు. వాటి సాయంతో.. అచ్చుగుద్దినట్లు ఉండేలా దొంగ సర్టిఫికేట్లను తయారు చేసుకున్నాడు. డాక్టర్ రాజేశ్ విదేశాలకు వెళ్లటంతో.. తానే రాజేశ్ అన్నట్లుగా చెప్పుకొని ఉద్యోగాన్ని సంపాదించారు. తన మీద ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు మంగళూరు నుంచి సహరన్ పూర్ కి బిచాణా ఎత్తేశాడు.

తానో ఫేమస్ సర్జన్ అని చెప్పుకోవటానికి అవసరమైన అన్ని పత్రాల్ని.. డిప్లమాలను పొందాడు. అందులో రెండు యూఎస్ కు చెందిన సర్టిఫికేట్లు కూడా పొందాడు. ఆసుపత్రి పెట్టి ఇప్పటివరకూ దాదాపు 70వేల ఆపరేషన్లు చేశాడు. అంతా బాగుందనుకున్న సమయంలోనే కథ అడ్డం తిరిగింది. ఓంపాల్ గుట్టు తెలిసిన ఒక అపరిచిత వ్యక్తి అతడికి ఫోన్ చేసి తనకు రూ.40లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

ఒకవేళ తాను చెప్పినంత డబ్బుల్ని ఇవ్వకుంటే.. అసలు కథ మొత్తం చెప్పేసి పోలీసులకు పట్టిస్తానని బెదిరించాడు. అప్పటికే పదేళ్లుగా మంచి పేరు ప్రఖ్యాతులతో బండి లాగిస్తున్న ఓంపాల్.. తనను రాజేశ్ కాదన్న విషయాన్ని పోలీసులు గుర్తించలేరనుకున్నాడు. బ్లాక్ మొయిలర్ ఎవరు? తన గుట్టు బయటపడే అవకాశం లేదని భావించిన అతగాడు డాక్టర్ రాజేశ్ పాత్రలో జీవిస్తూ.. పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

తనను ఎవరో బ్లాక్ మొయిల్ చేస్తున్నారని.. అతడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తొలుత ఓంపాల్ ను పోలీసులు సైతం అనుమానించలేదు. డాక్టర్ గా మంచి పేరు ఉండటం.. పదేళ్లుగా ఆసుపత్రి పెట్టి వైద్యం చేయటంతో అతన్ని బ్లాక్ మొయిల్ చేయటం నిజమని భావించారు. అయితే.. విచారణలో అసలు విషయం అర్థమై.. అవాక్కు అయ్యారు. వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. తమకింతకాలం వైద్యం చేస్తున్న వైద్యుడు నకిలీ అని తెలుసుకున్న లక్షలాది మంది షాక్ కు గురి అవుతున్నారు.