Begin typing your search above and press return to search.

ఆ నెట్ వ‌ర్క్ ఆధీనంలో 70 టీవీ చాన‌ళ్లు!

By:  Tupaki Desk   |   23 Sep 2021 6:30 AM GMT
ఆ నెట్ వ‌ర్క్ ఆధీనంలో 70 టీవీ చాన‌ళ్లు!
X
జీ నెట్ వ‌ర్క్ లో సోనీ ఇండియా వాటాల కొనుగోలుతో ఆవిర్భ‌వించే సంయుక్త నెట్ వ‌ర్క్ స‌త్తా చాలా పెద్ద‌గా క‌నిపిస్తూ ఉంది! ఇప్ప‌టికే పాతుకుపోయిన ఈ రెండు నెట్ వ‌ర్క్ ల ప‌రిధిలో ఇక ఏకంగా 70 టీవీ చాన‌ళ్లు ఉండ‌బోతున్నాయి! డెబ్బై టీవీ చాన‌ళ్లంటే మాట‌లేమీ కాదు! అందులోనూ వీటిల్లో అత్యంత టాప్ రేటింగ్ చాన‌ళ్లున్నాయి. సోనీ ఖాతాలో అటు స్పోర్ట్స్ చాన‌ళ్లు, ఇటు ఎంట‌ర్ టైన్ మెంట్ చాన‌ళ్లున్నాయి. సోనీ స్పోర్ట్స్ విభాగంలోనే నాలుగైదు చాన‌ళ్లున్నాయి. ఇక సోనీ ఎంట‌ర్ టైన్ మెంట్ లో హిందీలో టాప్ చాన‌ళ్లున్నాయి.

ఇక జీ నెట్ వ‌ర్క్ అటు ఎంట‌ర్ టైన్ మెంట్ విభాగంలోనూ, ఇటు రీజ‌న‌ల్ చాన‌ళ్ల‌తోనే భారీ ఎత్తున విస్త‌రించింది ఉంది. వీటి సంఖ్యా గ‌ణ‌నీయంగా ఉంది. హిందీ ఎంట‌ర్ టైన్ మెంట్లో జీ నెట్ వ‌ర్క్ ద‌శాబ్దాల నుంచి ముందు వ‌ర‌స‌లో ఉంది. ఆ త‌ర్వాత రీజ‌న‌ల్ మార్కెట్లోకి వ‌చ్చి, అక్క‌డా స‌క్సెస్ అయ్యింది.

ఒక్క మాట‌లో చెప్పాలంటే రెండు పోటాపోటీ సంస్థ‌లు చేతులు క‌లిపితే ఎలా ఉంటుందో.. జీ, సోనీల క‌ల‌యిక కూడా అలానే ఉంది. వీటి సంయుక్త ఖాతాలో ఏకంగా 70 చాన‌ళ్లు ఉండ‌బోతున్నాయి. అలాగే త‌మ డిజిట‌ల్ లైబ్ర‌రీల‌ను కూడా ఈ చాన‌ళ్ల‌న్నీ పంచుకుంటాయ‌ట‌. ఇక ఓటీటీ విష‌యంలోనూ వీటి శ‌క్తి ఏకం కానుంది.

జీ ఫైవ్, సోనీ లివ్ లు రెండు ప్ర‌ముఖ ఓటీటీలుగా ఉన్నాయి. ఇప్పుడు అవి కూడా ఒకే గొడుగు కింద‌కు రానున్నాయి. ఈ సంస్థ‌ల‌కు చెరో స్టూడియో కూడా ఉంది. హాలీవుడ్ సినిమాల ప్ర‌సారంతో మొద‌లుపెడితే, సీరియ‌ళ్ల వ‌ర‌కూ ఈ రెండు సంస్థ‌ల క‌ల‌యిక‌తో ఒక విస్తృత‌మైన నెట్ వ‌ర్క్ ఏర్పడుతోంది.

అయితే జీ మీడియా పేరుతో కొన్ని చాన‌ళ్లున్నాయి. జీ ఎంట‌ర్ టైన్ మెంట్ వేరు, జీ మీడియా వేరు. జీ మీడియా విభాగంలో న్యూస్ చాన‌ళ్లు ప్ర‌ధానంగా ఉంటాయి. సోనీ, జీ క‌ల‌యిక‌తో జీ మీడియాకు సంబంధం లేద‌ట‌. పేరుకు జీ అనే ఉన్నా.. ఈ డీల్ తో జీ మీడియాకు సంబంధం లేద‌ట‌. జీ మీడియా ప‌రిధిలో వివిధ భాష‌ల్లో వార్తా చాన‌ళ్లు, వెబ్ సైట్లు ఉన్నాయి. ఈ డీల్ తో సంబంధం లేకుండా అవి వేరేగా ఉండ‌బోతున్నాయ‌ని తెలుస్తోంది.