Begin typing your search above and press return to search.

ఆ 7 లెటర్స్ లో ఏముంది?

By:  Tupaki Desk   |   20 Jan 2016 5:22 AM GMT
ఆ 7 లెటర్స్ లో ఏముంది?
X
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సటీ విద్యార్థి ఆత్మహత్య విషయంలో రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్న తీరుపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇష్యూ పూర్వాపరాలు తెలుసుకోకుండా కాంగ్రెస్ పార్టీ దీన్ని జాతీయ స్థాయి సమస్యగా మార్చేందుకు ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఉపాధ్యక్షు రాహుల్ గాంధీ నేరుగా హైదరాబాద్ రావడంతో మిగతా పార్టీల నేతలూ ఆయన్ను అనుసరిస్తూ పరామర్శలకు వస్తున్నారు. ఇందులో విద్యార్థులపై ప్రేమ కంటే మోడీ సర్కారును ఇరుకున పెట్టాలన్న ఉద్దేశమే కనిపిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మరోవైపు రోహిత్ వ్యవహారానికి సంబంధించి మానవ వనరుల శాఖ.. సెంట్రల్ యూనివర్సిటీకి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించి ఏడు లేఖలు వెలుగుచూశాయి. విద్యార్థుల మీద చర్యలు తీసుకునే ముందు ఎంత కసరత్తు జరిగింది? అసలేం జరిగిందన్న విషయాలు దీనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

- మొదటి లేఖను 2015 ఆగస్టు 10న కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయకు హైదరాబాద్ బీజేపీ ఉపాధ్యక్షుడు నందనం దివాకర్ రాశారు.

లేఖలో ఏముంది.. యాకూబ్ మెమన్ కోసం సెంట్రల్ వర్సిటీలో ప్రార్థనా సమావేశం జరిగింది. దీన్ని నిరసిస్తూ సెంట్రల్ వర్సిటీ ఏబీవీపీ అధ్యక్షుడు నందనం సుశీల్ కుమార్ ఫేస్ బుక్ లో ఒక కామెంట్ చేశారు. దీంతో.. ఆగస్టు 4 తెల్లవారుజామున అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ కు చెందిన ప్రశాంత్.. మరో 30 మంది సుశీల్ మీద దారుణంగా దాడి చేశారు. ఒక యాకూబ్ ను ఉరితీస్తే వేల మంది యాకూబ్ లు పుట్టుకొస్తారంటూ సదరు యూనియన్ పోస్టర్లు పంచింది. దీనిపై విచారణ జరిపి చర్యలు చేపట్టాలంటూ నందనం దివాకర్ ఆ లేఖలో కోరినట్లుగా ఉంది.

- రెండో లేఖను కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి మరో కేంద్రమంత్రి (సహాయ) బండారు దత్తాత్రేయ రాశారు. యాకూబ్ మెమన్ ను ఉరి తీసినప్పుడు దీనికి వ్యతిరేకంగా అంబేడ్కర్ స్టూడెంట్స్ యూనియన్ నిరసన చేపట్టిందని... దాన్ని వ్యతిరేకించిన ఏబీవీపీ నాయకుడు సుశీల్ పై క్యాంపస్ లోనే దాడి జరిగినా యూనివర్సిటీ యాజమాన్యం ప్రేక్షక పాత్ర పోషించిందని... చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ లేఖ రాశారు.

- మూడో లేఖను వర్సిటీ రిజిష్ట్రార్ కు మానవ వనరుల శాఖ అండర్ సెక్రటరీ రాంజీ పాండే రాశారు. దత్తాత్రేయ రాసిన లేఖను పరిశీలించి.. విచారించాలని మాత్రమే అందులో కోరారు.

- నాలుగో లేఖను వర్సిటీ రిజిష్ట్రార్ కు మానవ వనరుల శాఖ డిప్యూటీ సెక్రటరీ సుబోధ్ కుమార్ రాశారు. వర్సిటీలో జాతి వ్యతిరేక కార్యకలాపాలు.. పీహెచ్ డీ విద్యార్థి సుశీల్ మీద దాడికి సంబంధించి వివరాలు ఉన్నాయని... యూనివర్సిటీ స్పందనను తెలిపితే మంత్రికి సమాధానం ఇస్తామని అందులో సమాచారమిచ్చారు.

- ఐదో లేఖను వర్సిటీ వీసీకి మానవ వనరుల శాఖ డిప్యూటీ సెక్రటరీ సుబోధ్ కుమార్ రాశారు. ఇది కూడా వర్సిటీ స్పందన కోరుతూ రాసిన లేఖే.

- ఆరో లేఖ వర్సిటీ వీసీకి మానవ వనరుల శాఖ జాయింట్ సెక్రటరీ సుఖ్ బీర్ సింగ్ నుంచి వచింది. వాస్తవాలు తెలపాలని లేఖలు రాసినా స్పందన లేదని.. వ్యక్తిగత పరిశీలన జరిపి వాస్తవాల్ని తెలియజేయాలని అందులో కోరారు.

- ఏడో లేఖను వర్సిటీ వీసీకి మానవ వనరుల శాఖ అండర్ సెక్రటరీ రాంజీ పాండే రాశారు. వర్సిటీలో జరుగుతున్న జాతి వ్యతిరేక కార్యకలాపాలు.. సుశీల్ మీద జరిగిన దాడికి సంబంధించి పంపిన లేఖను పరిశీలించలేదని... వాస్తవాలు ఇప్పటివరకూ తమకు అందలేదని పేర్కొంటూ రాసిన లేఖ అది.

ప్రస్తుతం ఈ లేఖలు చర్చనీయాంశంగా మారాయి. అయితే... యూనివర్సిటీలో జరుగుతున్న పరిణామాలపై మానవ వనరుల శాఖ వివరాలు తెలుసుకునే ప్రయత్నం కనిపించిందే తప్ప ఎలాంటి సూచనలు అందులో లేవన్న వాదన వినిపిస్తోంది.