Begin typing your search above and press return to search.

హైదరాబాద్ కు 69వేల మంది.. వారంతా ఇప్పుడెక్కడ?

By:  Tupaki Desk   |   21 March 2020 4:30 PM GMT
హైదరాబాద్ కు 69వేల మంది.. వారంతా ఇప్పుడెక్కడ?
X
కరోనా వైరస్ ఇన్ని దేశాలకు ఎలా పాకింది? అన్ని లక్షల మందికి ఎలా చేరుతోంది? అన్ని వేల మంది ఎందుకు చనిపోతున్నారు? ఇటలీ.. ఇరాన్.. లాంటి దేశాలు ఎందుకంత దారుణంగా ఎఫెక్ట్ అవుతున్నాయి? అన్న ప్రశ్నలకు సింఫుల్ సమాధానాలు వెతికితే వచ్చే సమాధానం.. కరోనా విషయంలో ప్రజల నిర్లక్ష్యం.. అవగాహన రాహిత్యం.. తేలిగ్గా తీసుకోవటమే. ప్రాశ్చాత్య దేశాల్లో జరిగిన పొరపాట్లే.. మన దేశంలోనూ జరుగుతున్నాయా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. ఈ రోజు ఇటలీ కరోనా కారణంగా అతలాకుతలం కావటానికి కారణం.. ఆ దేశంలోని ప్రజలు కరోనాను తేలిగ్గా తీసుకోవటం.. నియంత్రణ చర్యలు సరిగ్గా చేపట్టకపోవటమేనని చెప్పాలి. స్వీయ నియంత్రణ లేకుంటు కరోనాను కంట్రోల్ చేయటం ఎంతమాత్రం సాధ్యం కాదు.

ఇప్పుడో లెక్క తెలంగాణ రాష్ట్రంలోని అధికారులకు నిద్ర లేకుండా చేయటమే కాదు.. గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తోంది. ఈ నెల ఒకటి నుంచి ఇప్పటివరకూ విదేశాల నుంచి హైదరాబాద్ కు వచ్చినవారి సంఖ్య ఏకంగా 69వేలుగా చెబుతున్నారు. ఇలా వచ్చిన వారు అమెరికా.. యూరప్ దేశాల నుంచి వచ్చిన వారే నలభై వేల మంది వరకూ ఉన్నట్లుచెబుతున్నారు. మలేషియా.. సింగపూర్.. దుబాయ్ తో పాటు ఇతర గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన వారు మరో 20వేలకు పైనే ఉంటారని తెలుస్తోంది.

మార్చి 10 నుంచి అతర్జాతీయ విమానాశ్రయంలో విదేశీ ప్రయాణికుల్ని పరీక్షించటం మొదలైన తర్వాత కూడా యూరోపియన్ దేశాలైన ఇటలీ.. జర్మనీ.. ఫ్రాన్స్.. బ్రిటన్ నుంచి వచ్చిన 540 మంది ప్రజల్లో కలిసిపోయినట్లు గుర్తించారు. వీరంతా మార్చి మూడు నుంచి పద్నాలుగు మధ్యలోనే హైదరాబాద్ కు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఇప్పుడు వారెక్కడ? అన్నది ప్రశ్నగా మారింది. కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చిన వారిని.. వైద్య బృందాలు తేలిగ్గా తీసుకొని ఎలా వదిలేశారంటూ ఎయిర్ పోర్టు వర్గాలు విస్తుపోతున్న పరిస్థితి.

కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల నుంచి గడిచిన పది రోజుల్లో వచ్చిన ప్రయాణికుల్లో చాలా కొద్దిమందే ఐసోలేషన్ వార్డుల్లో చేరారని.. మిగిలిన వారి పరిస్థితి ఏమిటన్నది క్వశ్చన్ గా మారింది. ఇలాంటి వారిలో కొద్ది మందికి కరోనా పాజిటివ్ ఉన్నా.. జరిగే డ్యామేజ్ భారీగా ఉంటుందని చెబుతున్నారు. గడిచిన కొద్ది రోజులుగా హైదరాబాద్ కు వచ్చిన విదేశీ ప్రయాణికులు ఎక్కడున్నారు? వారి ఆరోగ్య పరిస్థితి ఇప్పుడెలా ఉందన్న రివర్స్ మేనేజ్ మెంట్ చేస్తున్న తెలంగాణ అధికారులకు.. వారి లెక్కను తేల్చే విషయంలో నిమగ్నమయ్యారు. వారి వివరాలు కొన్ని లెక్క తేలక కిందామీదా పడుతున్నట్లు సమాచారం. ఇన్ని వేల మంది విదేశాల నుంచి వచ్చి.. ఇప్పుడు వారిలో ఎవరు ఎక్కడేం చేస్తున్నారన్నది తేల్చటం అంత తేలికైన విషయం కాదంటున్నారు.