Begin typing your search above and press return to search.

దేశంలో వైరస్ విజృంభణ .. ఒక్క రోజే దేశంలో 6566 , ఏపీలో 54 కేసులు !

By:  Tupaki Desk   |   28 May 2020 7:05 AM GMT
దేశంలో వైరస్ విజృంభణ .. ఒక్క రోజే దేశంలో 6566 , ఏపీలో 54 కేసులు !
X
దేశంలో వైరస్ మహమ్మారి రోజురోజుకి మరింత ఉద్ధృతమవుతోంది. ప్రతి రోజు పాజిటివ్ కేసుల రికార్డు స్థాయిలో నిర్ధారణ అవుతున్నాయి. గత వారం నుంచి రోజుకు 6 వేల కేసులకు తగ్గకుండా నమోదవుతూ ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం.. గత 24 గంటల్లో 6,566 కొత్త కేసులు నమోదయ్యాయి. దీనితో ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 158,086కి చేరింది. ప్రస్తుతం 86,110 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 67691 మంది వ్యాధి నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. అటు.. మొత్తం 4,531 మంది కరోనాతో చనిపోయారు.

ఇక ఏపీలో కూడా వైరస్ రోజురోజుకి మరింత వేగంగా విజృంభిస్తూనే ఉంది. గత 24 గంటల్లో 9,858 శాంపిళ్లను పరీక్షించగా మరో 54 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలాగే 45 మంది వైరస్ కి చికిత్స తీసుకోని కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపింది. ఇక, వ్యాధి తీవ్రత ఎక్కువై కర్నూలుకు చెందిన రోగి మృతి చెందినట్లు పేర్కొంది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 59 కు చేరింది. రాష్ట్రంలో మొత్తం 2841 కేసులు నమోదు కాగా 1958 మంది డిశ్చార్జి అయ్యారు.

ఇక మహారాష్ట్రలో వైరస్ విజృంభణ ఏ మాత్రం తగ్గడంలేదు. బుధవారం కొత్తగా 2,190 కేసులు నమోదుకాగా.. మరో 105 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలోని మొత్తం కేసుల్లో 37 శాతం, మరణాల్లో 57 శాతం ఒక్క మహారాష్ట్రలోనే నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య 56,948కి చేరింది. మొత్తం 1,897 మంది ప్రాణాలు కోల్పోయారు.