Begin typing your search above and press return to search.

ఆ ఇంట్లో వారి ఓట్లు ప‌డితే గెలిచిన‌ట్లేన‌ట‌!

By:  Tupaki Desk   |   11 May 2019 12:05 PM GMT
ఆ ఇంట్లో వారి ఓట్లు ప‌డితే గెలిచిన‌ట్లేన‌ట‌!
X
ఎన్నిక‌ల వేళ‌.. బ‌య‌ట‌కు వ‌చ్చే కొన్ని విష‌యాలు ఆస‌క్తిక‌రంగా ఉంటాయి. తాజాగా చెప్పే ఉదంతం ఆ కోవ‌కు చెందిందే. ఎవ‌రి దాకానో ఎందుకు? మొద‌ట మీ సంగ‌తికే వ‌ద్దాం? మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉంటాయి? మ‌హా అయితే.. రెండు..కాదంటే నాలుగు. అంతేనా? స‌రే.. మీ చుట్ట‌ప‌క్కాల్లో భారీగా ఓట్లు ఉన్న కుటుంబం ఏదైనా తెలుసా? ఉంటే? ఎన్ని ఓట్లు ఉంటాయి? ప‌దికి మించి స‌మాధానం చెప్ప‌లేరు ఎవ‌రైనా.

కానీ.. అల‌హాబాద్ లోని బ‌హ్రెచా గ్రామానికి చెందిన 98 ఏళ్ల రామ్ న‌రేష్ ఇంట్లో ఓట్లు ఎన్ని ఉంటాయో తెలుసా? అక్ష‌రాల 66 ఓట్లు. ఒక్క ఓటుతోనే ఫ‌లితం తారుమారు అయ్యే ప‌రిస్థితి. అలాంటిది 66 ఓట్లు ఒక ఇంట్లో ఉండ‌టం అంటే మాట‌లా? వారంతా ఎవ‌రికి ఓటు వేస్తే.. వారి గెలుపు ఖాయ‌మ‌న్న మాట‌ను అక్క‌డి వారు చెబుతుంటారు.

ఈ కార‌ణంతోనే యూపీలోని రామ్ న‌రేష్ వారింటికి ఎన్నిక‌ల బ‌రిలో ఉన్న ప్ర‌తి అభ్య‌ర్థి త‌ప్ప‌నిస‌రిగా వారింటికి వ‌చ్చి.. హాజ‌రు వేయించుకొని.. త‌మకే ఓటు వేయాల‌ని కోరుతూ ఉంటార‌ట‌. దీంతో.. ఆయ‌న ఇంట రాజ‌కీయ పండుగ వాతావ‌ర‌ణం పెద్ద ఎత్తున క‌నిపిస్తుంద‌ని చెబుతారు. వ‌చ్చిపోయే పార్టీ అభ్య‌ర్థుల‌తో సందడిగా ఉంటున్న రామ్ న‌రేశ్ ఇంట్లో ఏకంగా 82 మంది కుటుంబ‌స‌భ్యులుంటారు. వారిలో 66 మందికి ఓటుహ‌క్కు ఉంది. వ్య‌వ‌సాయాన్ని జీవ‌నోపాధిగా భావించే ఆ కుటుంబంలో కేవ‌లం ఇద్ద‌రు మాత్ర‌మే ముంబ‌యిలో ఉంటార‌ని.. మిగిలిన వారంతా ఊళ్లోనే క‌లిసి ఉండ‌టం విశేషం.

ఇప్ప‌టికి త‌మ‌ది ఉమ్మ‌డి కుటుంబంగా రామ్ న‌రేశ్ చెబుతారు. త‌మ అంద‌రికి క‌లిపి ఒకే వంట‌గ‌ది ఉంటుంద‌ని.. త‌మ భోజ‌నం కోసం రోజూ 15 కేజీల బియ్యం.. 20 కేజీల కూర‌గాయ‌లు వండుతార‌ని.. రొట్టెల కోసం 10 కేజీల పిండి అవ‌స‌ర‌మ‌వుతుంద‌ని చెబుతారు. ఇన్నేళ్ల‌లో త‌మ కుటుంబంలోని ఎవ‌రికి వేరుగా ఉండాల‌న్న ఆలోచ‌న రాలేద‌ని.. త‌మ మాదిరే త‌మ జాతి మొత్తం ఒకే కుటుంబంగా ఉండాల‌ని తాను కోరుకుంటాన‌ని మీడియాకు చెప్పారు.

ఈసారి ఎన్నిక‌ల్లో త‌మ కుటుంబంలోని ఎనిమిది మందికి కొత్త‌గా ఓటుహ‌క్కు వ‌చ్చింద‌ని.. త‌మ కుటుంబంలోని వారంతా ఒకే పోలింగ్ బూత్ లో ఓటు వేయ‌టానికి అవ‌కాశం క‌ల్పించిన‌ట్లుగా ఆయ‌న చెప్పారు. ఎన్నిక‌ల వేళ త‌మ ఇంటికి రాజ‌కీయ పార్టీ నేత‌లంతా క్యూ క‌డ‌తార‌ని.. త‌మ స‌మ‌స్య‌ల్ని ఏక‌రువు పెట్ట‌గానే.. వాటిని ప‌రిష్క‌రిస్తామ‌ని చెబుతార‌న్నారు.కానీ.. ఎన్నిక‌ల్లో గెలిచిన త‌ర్వాత మాత్రం ప‌త్తా లేకుండా పోతార‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

మ‌ట్టిగోడ‌ల‌తో ఉన్న త‌మ ఇంటిని కూల్చి ప‌క్కా ఇల్లు క‌ట్టుకోవాల‌ని ఎన్నో ఏళ్లుగా అనుకుంటున్నామ‌ని.. త‌మ ఇంటి మీద నుంచి వెళ్లే హైటెన్ష‌న్ వైర్లు అందుకు అడ్డుగా ఉన్నాయ‌న్నారు. ఇంట్లో అమ్మాయిల‌కు వేర్వేరు గ‌దులు లేక ఇబ్బంది ప‌డుతున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. త‌మ‌ స‌మ‌స్య‌ల్ని ఓట్లు అడ‌గ‌టానికి వ‌చ్చే నేత‌ల‌కు చెప్ప‌టం.. వారు హామీలు ఇవ్వ‌ట‌మే త‌ప్పించి.. ఇప్ప‌టివ‌ర‌కూ ప‌రిష్క‌రించ‌లేద‌ని చెప్పారు. పోలింగ్ రోజున త‌మ ఇంట్లో స‌భ్యుల‌తా త‌ప్ప‌నిస‌రిగా ఓట్లు వేస్తామ‌ని చెప్పే రామ్ న‌రేశ్‌.. అస‌లుసిస‌లు స్ఫూర్తిదాత‌గా చెప్ప‌క త‌ప్ప‌దు.