Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో 66 అంతస్తుల భారీ భవనం

By:  Tupaki Desk   |   25 Aug 2019 1:35 PM IST
హైదరాబాద్ లో 66 అంతస్తుల భారీ భవనం
X
భాగ్యనగరిలో భారీ భవనం ఒకటి రానుందా? అంటే అవునంటున్నారు. తాజాగా చైనాకు చెందిన ఒక ప్రముఖ నిర్మాణరంగ సంస్థ ఒక భారీ ప్రాజెక్టుకు తెర తీసినట్లుగా తెలుస్తోంది. ఒకప్పుడు హైదరాబాద్ లో పది అంతస్తులు.. 20 అంతస్తులంటేనే అమ్మో అనుకునే స్థాయి నుంచి ఇప్పుడు 40 అంతస్తుల వరకూ భవనాలు వచ్చేశాయి. తాజాగా ఒక భారీ ఆకాశ హర్మ్యానికి అనుమతి ఇవ్వాలంటూ హెచ్ ఎండీఏకు చేసుకున్న దరఖాస్తు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఎందుకంటే.. 4.6 ఎకరాల్లో 239 మీటర్ల ఎత్తులో 66 బహుళ అంతస్తుల భవన నిర్మాణం అనుమతి కోసం ఒక ప్రైవేటు నిర్మాణ సంస్థ ప్రణాళికను సిద్ధం చేసుకుంది. స్థానికంగా ఉన్న ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి భాగస్వామ్యంతో ఈ ఆకాశ హర్మ్యానికి ప్లాన్ చేస్తున్నారు.

కోకాపేటలో నిర్మించే ఈ భారీ భవన ప్రాజెక్టు సుమారు రూ.1800 కోట్ల నుంచి రూ.2వేల కోట్ల వరకూ ఉంటుందని తెలుస్తోంది. 66 అంతస్తుల్లో నిర్మించే ఈ భారీ ఆకాశ హర్మ్యంలో 58 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ టవర్ ను ఏర్పాటు చేయనున్నట్లు చెబుతున్నారు. ఈ భారీ భవనంలో నివాసం కంటే కూడా వ్యాపార అవసరాల కోసమే ఏర్పాటు చేయనున్నట్లుగా తెలుస్తోంది.

ఈ భారీ టవర్ లో షాపింగ్ మాల్స్.. స్టార్ హోటళ్లతో పాటు.. పెద్ద ఎత్తున కార్యాలయాల్ని ఏర్పాటు చేయనున్నారు. వాటితో పాటు సర్వీసు అపార్ట్ మెంట్లు.. స్విమ్మింగ్ పూల్.. క్లబ్ హౌస్.. పది అంతస్తుల్లో స్టార్ హోటల్ లాంటివి నిర్మిస్తారు. ఇక.. 63వ అంతస్తులో నగర అందాల్ని అస్వాదించేందుకు వీలుగా ప్రత్యేకంగా స్కైలాంజ్ ను ఏర్పాటు చేస్తారు. చూస్తుంటే.. ఈ నిర్మాణం ఓకే అయితే.. హైదరాబాద్ సిగలో ఒక విలువైన ఆభరణంగా మారుతుందనటంలో ఎలాంటి సందేహం లేదని చెప్పాలి.