Begin typing your search above and press return to search.

ఢిల్లీ అసెంబ్లీని అరెస్టు చేశారు.

By:  Tupaki Desk   |   26 Jun 2016 7:22 AM GMT
ఢిల్లీ అసెంబ్లీని అరెస్టు చేశారు.
X
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీపై ఎమర్జెన్సీ ప్రకటించారా? కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కేజ్రీవాల్ కథ ముగించేందుకు నడుం బిగించిందా? అంటే ఆ ప్రయత్నం జరుగుతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. చాలాకాలంగా కేంద్రం - ఢిల్లీ ప్రభుత్వాల మధ్య ఉన్న విభేదాలు తాజా పరిణామాలతో తారస్థాయికి చేరాయి. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సహా 65 మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను ఢిల్లీలో అరెస్టు చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కేంద్రం తొందర పడిందా.. అరవింద్ కేజ్రీవాల్ తన రాజకీయ వ్యూహాలతో కేంద్రానికి ఆ పరిస్థితి కల్పించారా అన్నది ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది.

ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఢిల్లీ ఎమ్మెల్యేలు 65 మంది కేంద్రం ఒకేసారి అరెస్టు చేసింది. ఇంత పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలుండగా ఆప్ కు 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆప్ ఎమ్మెల్యేలు 67 మందిలో సీఎం కేజ్రీవాల్ మరో ఎమ్మెల్యే మినహా మిగతావారందరినీ అరెస్టు చేయడం కలకలం రేపింది. దీంతో ఢిల్లీ అసెంబ్లీని మొత్తం అరెస్టు చేసినట్లుగా అయింది.

నిన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే దినేశ్‌ మోహనియా విలేకరుల సమావేశంలో మాట్లాడుతుండగా అరెస్టు చేసి తీసుకెళ్లడానికి నిరసనగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రధాని నివాసాన్ని ముట్టడించేందుకు ర్యాలీగా బయల్దేరి వెళ్లారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తుగ్లక్‌ రోడ్డులో ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా సహా 65 మంది ఆప్‌ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాగా 1975లో జూన్ 25న ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన నాటి పరిస్థితులు ఏర్పడ్డాయని.. అదే జూన్ 25న ప్రధాని ఢిల్లీపై ఎమర్జెన్సీ ప్రకటించారంటూ నిన్న కేజ్రీవాల్ మండిపడ్డారు. నిన్న ఎమ్మెల్యే అరెస్టుకు నిరసనగా ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఆయన మాటలు నిజం చేసేలా ఏకంగా ఒక రాష్ట్ర ప్రభుత్వంలోని 65 మంది ఎమ్మెల్యేలను కేంద్రం అరెస్టు చేయడం ఇప్పుడు భారత దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అతిపెద్ద కుదుపుగా కనిపిస్తోంది.