Begin typing your search above and press return to search.

61 శాతం మందికి వ్యాక్సిన్ పై ఆసక్తి లేదట ..షాకింగ్ సర్వే!

By:  Tupaki Desk   |   26 Oct 2020 6:30 PM IST
61 శాతం మందికి వ్యాక్సిన్ పై ఆసక్తి లేదట ..షాకింగ్ సర్వే!
X
కరోనా జోరు రోజురోజుకి పెరిగిపోతుంది. ప్రతి రోజు కూడా వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. అలాగే పలు దేశాల వైద్య నిపుణులు కరోనాను అరికట్టే వ్యాక్సిన్ ను కనిపెట్టే ప్రయత్నం లో బిజీగా ఉన్నారు. అయితే రోజులు గడిచే కొద్ది ప్రజల్లో కరోనా పై ఉన్న భయం తగ్గిపోతుంది. మహమ్మారికి వ్యాక్సిన్ కోసం పలు సంస్థలు తీవ్రంగా శ్రమిస్తుంటే మరోవైపు తాజా అధ్యయనంలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. కరోనా కు టీకా వచ్చే ఏడాది తొలినాళ్లలో వచ్చినా దానిని వేయించుకోడానికి 61 శాతం మంది ఆసక్తిచూపడంలేదని లోకల్‌ సర్కిల్స్‌ సంస్థ సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 225 జిల్లాల్లోని 25వేల మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. కరోనా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత మళ్లీ పాత రోజులు వస్తాయా అని 8,312 మందిని ప్రశ్నించగా.. 61 శాతం మంది టీకా వేయించుకోడానికి ఆసక్తి చూపలేదు.

అంతేకాదు, టీకా ఉచితంగా వేస్తామన్నా దుష్ప్రభావాలు, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయనే అనుమానంతో 51 శాతం మంది వద్దన్నారు. అలాగే, వచ్చే ఏడాదిలో ఎప్పుడొచ్చినా అసలు తాము వ్యాక్సిన్ వేయించుకోబోమని 10 శాతం మంది తెలిపారు. కరోనాతో కలిసి బతికేస్తామని 8,496 మందిలో 38శాతం మంది వెల్లడించగా ఆంక్షలతో చాలా విసిగిపోయామని 23శాతం ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. కానీ, 33 శాతం మంది ఆందోళన చెందుతున్నామని చెబితే, ఒత్తిడిలో ఉన్నామని 20శాతం వెల్లడించారు. దాని పని దానిదే మన పని మనదే అనే విధంగా 19శాతం మంది సమాధానమిచ్చారు. టీకా వచ్చిన తర్వాత పరిస్థితి సాధారణంగా ఉంటుందని 12 శాతం మంది చెప్పగా.. 25 శాతం మంది మాత్రం టీకా వచ్చినా సాధారణ పరిస్థితి నెలకోవడం కష్టమని పెదవి విరిచారు. కరోనా వైరస్ ఆంక్షలు ఈ ఏడాది డిసెంబరు 31 వరకు ఉంటాయని 14 శాతం మంది, వచ్చే ఏడాది మార్చి వరకు ఉంటాయని 6 శాతం మంది అభిప్రాయపడ్డారు.కరోనా మహమ్మారి దేశంలో ప్రారంభమైన 8 నెలల తర్వాత దానిపై ప్రజల ఆలోచనా విధానం, అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేశామని ఆ సంస్థ తెలిపిందిది. సర్వేలో పాల్గొన్న వారిలో 72శాతం పురుషులు, 28శాతం మహిళలు ఉన్నారని తెలిపింది.