Begin typing your search above and press return to search.

ఖమ్మంలో ఒక్క చిరునామాపై 600 ఓట్లు..?

By:  Tupaki Desk   |   29 April 2021 3:00 PM IST
ఖమ్మంలో ఒక్క చిరునామాపై 600 ఓట్లు..?
X
తెలంగాణలో వరుసగా ఎన్నికలతో రాజకీయ వేడి రగులుకుంటోంది. ఎమ్మెల్సీ ఎన్నికలు మరిచిపోకముందే నాగార్జున సాగర్ ఉప ఎన్నిక వచ్చేసింది. ఆ వేడి చల్లారకముందే ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ల ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఉత్కంఠను రాజేస్తుంది. శుక్రవారం కరోనా నిబంధనల మధ్య ఈ రెండు కార్పొరేషన్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ తో పాటు బీజేపీ, కాంగ్రెస్ లు పోటాపోటీగా తలపడబోతున్నాయి.

తాజాగా ఖమ్మం కార్పొరేషన్ కు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది. నగరంలోని ఓ వార్డులో ఒకే నంబర్ పై 600 ఓట్లు ఉన్నాయని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఖమ్మం కార్పొరేషన పరిధిలోని 5-7-200 అనే ఇంటనెంబర్ పై 600 నుంచి 900 ఓటర్లు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. బూత్ నెంబర్ 119 పరిధిలో ఉన్న ఈ అడ్రస్ లో మెడికల్ కాలేజీ హాస్టల్ ఉందని, అయితే ఇందులో ఉన్నవారంతా ఎప్పుడో వెకెట్ చేశారని వారు అంటున్నారు. ఈ వార్డులో బీజేపీ తరుపున పోటీ చేస్తున్న విజయారెడ్డి హాస్టల్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారని తెలిపింది.

ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ ఈ డివిజన్లో 3000 ఓట్ల వరకు అక్రమంగా ఉన్నాయని ఆరోపించింది. అంతేకాకుండా ఈ హాస్టల్ లో ఉన్నవారు సంవత్సరం కిందే ఇక్కడి నుంచి వెళ్లిపోయారని, అయినా వారి పేర్ల మీద ఓట్లు సృష్టించారని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన భార్య వసంత లక్ష్మిని మేయర్ ను చేసేందుకు ఇలా చేశాడని ఆరోపించారు.

నగరంలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లను సృష్టించి మేయర్ పదవి దక్కించుకునేందుకు పన్నాగం పన్నుతున్నారని బీజేపీ నాయకులతో పాటు కాంగ్రెస్ నాయకులు కూడా ఆరోపిస్తున్నారు. అయితే ప్రతిపక్షాల ఆరోపణలు అవాస్తవమని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ఏదీ ఏమైనా ఇలా ఒకే ఇంటి నంబర్ పై 600 ఓట్లు ఉండడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.