Begin typing your search above and press return to search.

ఆ రాష్ట్రాన్ని వణుకు పుట్టిస్తున్న 60 మంది

By:  Tupaki Desk   |   8 April 2020 11:10 AM GMT
ఆ రాష్ట్రాన్ని వణుకు పుట్టిస్తున్న 60 మంది
X
దేశంలో కరోనా కలకలం ఎంత ఉందో తెలిసిందే. విదేశాల నుంచి వచ్చిన వారి కారణంగా వ్యాప్తి చెందిన కరోనా వైరస్ కు లాక్ డౌన్ తో చెక్ పెట్టేసింది మోడీ సర్కారు. అయితే.. అనూహ్యంగా మర్కజ్ సదస్సు పుణ్యమా అని దేశంలో కరోనా కేసులు భారీగా పెరగటమేకాదు.. ఈ రోజున 5వేల కేసులకు దగ్గరగా వచ్చిందంటే.. అందుకు కారణంగా మర్కజ్ సదస్సుగా చెప్పాలి. మంగళవారం రాత్రి వేళకు దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 4789గా చెబుతున్నారు. ఇందులో అత్యధికంగా మహారాష్ట్రం లోనే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో మరే రాష్ట్రంలో లేనట్లుగా ఆ ఒక్క రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసులు 1161. దేశంలో నమోదైన ప్రతి నాలుగు కేసుల్లో ఒక కేసు ఆ రాష్ట్రంలోనే నమోదు కావటం చూస్తే.. పరిస్థితి ఏమిటో ఇట్టే అర్థమైపోతుంది.

పాజిటివ్ కేసుల లెక్క తేల్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే.. అరవై మంది ఆ రాష్ట్రానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నట్లుగా గుర్తించారు. మర్కజ్ సదస్సుకు హాజరైన తర్వాత దేశంలోని వివిధ రాష్ట్రాలకు వెళ్లిపోయారు. అలా వెళ్లిన వారిని ఆయా రాష్ట్రాల వారు గుర్తించి.. వారికి పరీక్షలు జరిపి క్వారంటైన్ కు తరలించారు. ఇదిలా ఉంటే.. మహారాష్ట్రలో మాత్రం సీన్ వేరుగా ఉంది.

ఆ రాష్ట్రం నుంచి మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారిలో 60 మంది ఆచూకీ లభించటం లేదు. వీరి కోసం గడిచిన కొద్ది రోజులుగా విపరీతంగా వెతుకుతున్నారు. వీరి ఆచూకీ లభించి.. పరీక్ష చేస్తే తప్ప.. ముప్పు ఎంత ఉందన్నది ఒక అంచనాకు రావొచ్చు. అందుకు భిన్నంగా పరిస్థితులు ఉండటంతో ఇప్పుడా రాష్ట్రం కిందామీదా పడుతోంది. దేశ వ్యాప్తంగా వెలుగు చూస్తున్న కొత్త కేసుల్లో దాదాపు మర్కజ్ తో లింకు ఉన్న వారే కావటం గమనార్హం. ఇదిలా ఉంటే.. మహారాష్ట్రలో ఆచూకీ లేకుండా ఉన్న అరవై మందిని ఎలా గుర్తించాలా? అన్నది ప్రశ్నగా మారింది. వారి ఫోన్లు స్విచాప్ చేసి ఉండటంతో వారిని పట్టుకోవటం సమస్యగా మారింది. వారిని ఎంత త్వరగా అదుపులోకి తీసుకుంటే తప్పించి.. కరోనా ముప్పు నుంచి రాష్ట్రం బయటపడలేదన్న మాట వినిపిస్తోంది. వారిని పట్టుకునేందుకు మహారాష్ట్ర పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.