Begin typing your search above and press return to search.

5జీ సేవలు.. ఎప్పుడో క్లారిటీ వచ్చేసింది

By:  Tupaki Desk   |   21 Aug 2022 11:30 AM GMT
5జీ సేవలు.. ఎప్పుడో క్లారిటీ వచ్చేసింది
X
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5జీ సేవల ఆరంభంపై తాజాగా స్పష్టత వచ్చేసింది. ఇటీవల 5జీ వేలాన్ని పూర్తి చేసి.. ఎవరికెంత స్పెక్ట్రం అన్నది తేల్చేసిన నేపథ్యంలో.. మిగిలింది వాటి సేవలు ఆరంభించటం మాటే. అయితే.. ఇదంతా జరగటానికి.. వినియోగదారుల చెంతకు చేరటానికి ఉన్న అడ్డంకులపై ఇప్పుడిప్పుడు క్లారిటీ వచ్చేస్తోంది. కంపెనీ సేవలు ఆరంభించటానికి మరో ఆరు నుంచి ఎనిమిది నెలల సమయం పడుతుందని చెబుతున్నారు. ముందుగా ఈ సేవల్ని దేశంలోని టాప్ టెన్ నగరాల్లోనే ప్రారంభించనున్నారు. ఎక్కడ అయితే 5జీ రెడీ స్మార్ట్ ఫోన్ యూజర్లు అధికంగా ఉన్నారో.. అక్కడి నుంచే సేవల్ని ఆరంభిస్తారు.

అయితే.. ఈ టాప్ టెన్ నగరాల్లో 5జీ సేవలు ఆరంభించటానికి అవసరమైన టవర్ల నిర్మాణం ఇప్పుడు పూర్తి కావాల్సి ఉంటుంది. ఇప్పటివరకున్న అంచనాల ప్రకారం పది నగరాల్లోనే దాదాపు 30వేల టెలికాం టవర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఏయే ప్రాంతాలకు ఎన్నెన్ని టవర్లు పూర్తి చేయాలన్న దానిపై భారీ లెక్కలే ఉన్నాయి. ఉదాహరణకు దేశ రాజధాని ఢిల్లీలో 5జీ సేవల్ని ఆరంభించాలంటే దాదాపు మూడు వేల టవర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అంత చేసిన తర్వాత కూడా మూడో వంతు సేవల్ని మాత్రమే ఆరంభించే వీలుందంటున్నారు.

ప్రధాన నగరాల్లోనూ ఏయే ప్రాంతాలకు.. ఎంత త్వరగా కవరేజీ లభిస్తుందన్నది ఆయా టెలికం కంపెనీల ప్లాన్ కు అనుసరించే ఉంటుందని చెబుతున్నారు. కొన్నినగరాల్లో భారీ కవరేజ్ ఉంటే.. మరికొన్ని నగరాల్లో ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే 5జీ సేవలు అందిస్తాయని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. టెలికం కంపెనీల ప్లానింగ్ కు అనుసరించే 5జీ సేవలు ఉండనున్నాయి. సో.. 5జీ సేవలు అన్నంతనే ఇట్టే ప్రారంభమయ్యే అవకాశం లేనట్లే. అంతేకాదు.. ఒకేసారిగా సేవలు మొత్తం అందుబాటులోకి రావన్న విషయంపైనా స్పష్టత వచ్చినట్లేనని చెప్పాలి.