Begin typing your search above and press return to search.

56 శాతం క్యాబ్ డ్రైవ‌ర్లు మందుబాబులేన‌ట‌!

By:  Tupaki Desk   |   4 Feb 2018 2:32 PM GMT
56 శాతం క్యాబ్ డ్రైవ‌ర్లు మందుబాబులేన‌ట‌!
X
కొంద‌రు యువ‌కులు మ‌ద్యం సేవించి హైద‌రాబాద్ న‌డిబొడ్డులో కారు న‌డిపి చిన్నారి రమ్య స‌హా మ‌రో ఇద్ద‌రి మ‌ర‌ణానికి కార‌ణ‌మైన ఘ‌ట‌న ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. మ‌ద్యం తాగి వాహ‌నం న‌డిపే వారు `సూసైడ్ బాంబ‌ర్ల‌`తో స‌మాన‌మి సాక్ష్యాత్తూ హైకోర్టు వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. `చిన్నారి` ర‌మ్య‌ ఘ‌ట‌న త‌ర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ త‌నిఖీల‌ను హైద‌రాబాద్ పోలీసులు ముమ్మరంగా చేప‌డుతున్నారు. మోతాదుకు మించి మ‌ద్యం సేవించి వాహ‌నం న‌డ‌ప‌డానికి బ‌దులు క్యాబ్ ల‌ను బుక్ చేసుకోవాల‌ని, అవ‌స‌ర‌మైతే ఆ బార్, ప‌బ్ ల యాజమాన్యాలు క్యాబ్ ల‌ను ఏర్పాటు చేయాల‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌యిన సంగ‌తి తెలిసిందే. అయితే, మ‌ద్యం మ‌త్తులో ఉన్న వారికి క్యాబ్ డ్రైవ‌ర్లు కూడా ర‌క్ష‌ణ క‌ల్పించ‌లేర‌ని ఓ స‌ర్వేలో తేలింది. తాజాగా ఢిల్లీలో జ‌రిపిన ఓ సర్వేలో క్యాబ్ డ్రైవ‌ర్ల గురించి విస్తుపోయే వాస్త‌వాలు వెల్ల‌డ‌య్యాయి. క్యాబ్, ట్యాక్సీ డ్రైవ‌ర్లలో 56 శాతం మంది మ‌ద్యం సేవించి క్యాబ్ న‌డుపుతున్నార‌ని తేలింది. మ‌రో 27 శాతం మంది మ‌ద్యం మ‌త్తులో ఉండ‌గానే బుకింగ్స్ స్వీక‌రిస్తామ‌ని తెల‌ప‌డం గ‌మ‌నార్హం.

ఢిల్లీ, ఎన్ సీఆర్, గ్రేట‌ర్ నోయిడా ప్రాంతాల‌లోని 10 వేల మంది క్యాబ్ డ్రైవ‌ర్ల పై గ‌త ఏడాది సెప్టెంబ‌రు 10 నుంచి డిసెంబ‌రు 10 మ‌ధ్య కాలంలో కమ్యూనిటీ ఎగైనెస్ట్ డ్రంకెన్ డ్రైవింగ్(సీఏడీడీ)....ఓ స‌ర్వే నిర్వ‌హించింది. ఎయిర్ పోర్టు, రైల్వే స్టేష‌న్, మెట్రో రైలు స్టేష‌న్లు, షాపింగ్ మాల్స్ వ‌ద్ద తిరిగే క్యాబ్ డ్రైవ‌ర్ల‌పై ఈ స‌ర్వే జ‌రిపారు. మ‌ధ్యాహ్నం 2 గంటల‌ నుంచి అర్థ‌రాత్రి ఒంటిగంల వ‌ర‌కు క్యాబ్ డ్రైవ‌ర్ల‌ను ఆ సంస్థ ప్ర‌తినిధులు ప్ర‌శ్నించారు. అందులో ఈ షాకింగ్ నిజాలు వెలుగులోకి వ‌చ్చాయి. అయితే, సుదీర్ఘంగా ఉండే ప‌నిగంట‌ల‌(12-15గంట‌లు) వ‌ల్ల క‌లిగే బ‌డ‌లిక‌నుంచి ఉప‌శ‌మ‌నం పొందేందుకు అధిక శాతం మంది ఆల్క‌హాల్ తీసుకుంటున్నార‌ని తేలింది. బుకింగ్స్ కు మ‌ధ్య‌లో ఉండే ఖాళీ స‌మ‌యాల్లో మ‌ద్యం సేవిస్తార‌ని తేలింది. చాలామంది కారులోనే మ‌ద్యం సేవిస్తార‌ని, అక్క‌డ‌యితే ఖ‌ర్చు త‌క్కువ అవుతుంనద‌ని భావిస్తున్నార‌ని తేలింది. అయితే, ఈ క్యాబ్ డ్రైవ‌ర్ల‌పై స‌ద‌రు సంస్థ‌లు చాలా వ‌ర‌కు ఎటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం లేద‌ని స‌ర్వేలో వెల్ల‌డికావ‌డం క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఈ ర‌కంగా మ‌ద్యం సేవించిన క్యాబ్ ల‌లో ప్ర‌యాణిస్తున్న మ‌హిళ‌లకు ఇబ్బందులు క‌లుగుతాయ‌ని తేలింది. ఇక‌నైనా, క్యాబ్ డ్రైవ‌ర్లు విధినిర్వ‌హ‌ణ‌లో ఉన్న‌పుడు మ‌ద్యం సేవించ‌కుండా ఉండేలా యాజ‌మాన్యాలు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప‌లువురు డిమాండ్ చేస్తున్నారు.