Begin typing your search above and press return to search.

గుజ‌రాత్ లో కాంగ్రెస్ కు ఎమ్మెల్యేల షాక్!

By:  Tupaki Desk   |   29 July 2017 8:01 AM GMT
గుజ‌రాత్ లో కాంగ్రెస్ కు ఎమ్మెల్యేల  షాక్!
X
రాబోయే ఎన్నిక‌లలో దేశవ్యాప్తంగా క‌మ‌ల వికాసం కోసం బీజేపీ స‌న్నాహాలు చేస్తోంది. అందుకోసం ప‌క‌డ్బందీ వ్యూహాల‌ను ర‌చిస్తోంది. జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌ర్వాత త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో జ‌రిగిన కీల‌క‌మైన ప‌రిణామాల వెనుక బీజేపీ హ‌స్తం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. రాబోయే ఎన్నిక‌ల్లో త‌మిళ‌నాడులోఓ బీజేపీ పాగా వేయాల‌ని చూస్తోంది. 2014 ఎన్నిక‌ల్లో మోదీని బిహార్ సీఎం నితీశ్ కుమార్ విమ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. రాబోయే ఎన్నిక‌ల్లో ప్ర‌ధాని ప‌ద‌వికి విప‌క్షాల అభ్య‌ర్థిగా నితీశ్ బ‌రిలో ఉంటార‌ని విశ్లేష‌కులు అంచనా వేశారు. కానీ, ఆ అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ నితీశ్ ...మోదీతో జ‌ట్టు క‌ట్టారు. త‌న‌కు దీటైన ప్ర‌త్య‌ర్థులు లేకుండా బీజేపీ పావులు క‌దుపుతోంది.

ప్ర‌స్తుతం మోదీ సొంత రాష్ట్రమైన గుజ‌రాత్ లోనూ సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. గుజ‌రాత్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వరుసపెట్టి రాజీనామాలు చేసి బీజేపీలో చేరేందుకు క్యూ క‌డుతున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అయోమ‌యంలో ప‌డింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 6గురు ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో మిగిలిన ఎమ్మెల్యేల‌ను కాపాడుకునేందుకు కాంగ్రెస్ య‌త్నిస్తోంది. అహ్మ‌ద్ పటేల్ ను రాజ్య‌స‌భ‌కు పంపించేందుకు ఆ పార్టీకి 47 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు అవ‌స‌రం. దీంతో, గుజరాత్‌లో రాజకీయ సంక్షోభం నుంచి బయటపడేందుకు కాంగ్రెస్ నానా తిప్ప‌లు ప‌డుతోంది. శుక్రవారం రాత్రి 54 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ పార్టీ బెంగుళూరుకు తరలించింది.

బీజేపీ ప్రలోభాలకు ఎమ్మెల్యేలు లొంగ‌కుండా ఉండేందుకే వారిని దూరంగా తీసుకెళ్తున్నట్లు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శైలేష్‌ పర్మార్‌ చెప్పారు. రాజ్యసభ ఎన్నికలకు ముందు బీజేపీ ఎమ్మెల్యేల‌ను ప్రలోభాలకు గురి చేస్తోందని, ఎమ్మెల్యేకు రూ.5 నుంచి 10 కోట్లు ఆఫర్‌ చేస్తున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పునాభాయ్‌ గమిట్‌ ఆరోపించారు. బీజేపీ డబ్బు ఇవ్వజూపుతోందన్న ఆరోపణలపై కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్ స్పందించారు. కాంగ్రెస్‌ ఓ మునిగిపోయే నావ అని, అందుకే ఆ పార్టీ ఎమ్మ‌ల్యేలు బ‌య‌ట‌ప‌డాల‌ని చూస్తున్నార‌ని అన్నారు. అందువ‌ల్ల కాంగ్రెస్ ఆరోప‌ణ‌లు అర్థ‌ర‌హిత‌మ‌ని అన్నారు. గుజరాత్‌ నుంచి రాజ్యసభ సీటుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాతో పాటు స్మృతి ఇరానీ కూడా నామినేషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.