Begin typing your search above and press return to search.

ఓటేయ‌డం కూడా రాదా.. చెల్ల‌ని ఓట్లు వేసిన ఎంపీలు, ఎమ్మెల్యేలు!

By:  Tupaki Desk   |   22 July 2022 4:48 AM GMT
ఓటేయ‌డం కూడా రాదా.. చెల్ల‌ని ఓట్లు వేసిన ఎంపీలు, ఎమ్మెల్యేలు!
X
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూట‌మి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ము ఘ‌న విజ‌యం సాధించాచిన సంగ‌తి తెలిసిందే. దేశంలో మొత్తం ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిపి 4,809 మంది ఉండగా.. వీరిలో 4,754 మంది ఓటు వేశారు. వీటిలో 53 చెల్లని ఓట్లున్నాయి.

ఈ చెల్ల‌ని ఓట్ల‌లో 15 మంది ఎంపీలు, 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో అత్యధికంగా అయిదేసి ఓట్లు చెల్లుబాటు కాకుండా పోయాయి. 2012 రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లోనూ 15 మంది ఎంపీలు, 54 మంది ఎమ్మెల్యేలు వేసిన ఓట్లు చెల్లకుండా పోయాయి.

రిటర్నింగ్‌ అధికారి పీసీ మోదీ చేసిన ప్రకటన ప్రకారం ఆమెకు 6,76,803 విలువైన ఓట్లు రాగా, యశ్వంత్‌ సిన్హాకు 3,80,177 విలువైన ఓట్లు దక్కాయి. పోలైన 4,754 ఓట్లలో 4,701 ఓట్లు చెల్లుబాటయ్యాయి. చెల్ల‌ని 53 ఓట్ల విలువ 15,397. కాగా చెల్లిన 4,701 ఓట్ల‌లో ద్రౌప‌ది ముర్ముకు 2824, య‌శ్వంత్ సిన్హాకు 1877 ఓట్లు ప‌డ్డాయి.

కాగా తెలంగాణ‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీత‌క్క విపక్ష కూట‌మి అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హాకు వేయ‌బోయి ఎన్డీయే కూట‌మి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముకు ఓటేసిన సంగతి తెలిసిందే. ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా మీడియాకు వెల్ల‌డించారు. అయితే ఆమె ఓటు కూడా చెల్ల‌లేద‌ని వార్తలు వ‌స్తున్నాయి. బ్యాలెట్ పేప‌ర్ పై సిరా ఇంకు ప‌డింద‌ని చెబుతున్నారు. అందుకే ఓటు చెల్ల‌లేద‌ని స‌మాచారం.

కాగా గ‌తంలో రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఓటు చెల్ల‌కుండా పోయింది. అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీచ‌ర్లు చెల్ల‌ని ఓట్లు వేశారు.

ఈ నేప‌థ్యంలో ఓట్లు వేయ‌డం కూడా చేత‌కాదా అని చెల్ల‌ని ఓట్లేసిన ఎంపీలు, ఎమ్మెల్యేల‌పై సోష‌ల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. శాస‌న‌స‌భ‌లు, పార్ల‌మెంటుకు ప్రాతినిధ్యం వ‌హిస్తూ దేశ ప్ర‌థ‌మ పౌరుడి ఎన్నిక‌లో ఓటు ఎలా వేయాలో కూడా తెలియ‌క‌పోవ‌డం సిగ్గుచేట‌ని నెటిజ‌న్లు విమ‌ర్శిస్తున్నారు.