Begin typing your search above and press return to search.

దేశ వ్యాప్తంగా 52 వేలు.. ఆ ఒక్క రాష్ట్రంలోనే 32వేలు

By:  Tupaki Desk   |   25 March 2021 4:13 AM GMT
దేశ వ్యాప్తంగా 52 వేలు.. ఆ ఒక్క రాష్ట్రంలోనే 32వేలు
X
మొన్నటి వరకు పెద్దగా ప్రభావం చూపని కరోనా వైరస్.. తాజాగా మరింతగా చెలరేగిపోతోంది. అంతకంతకూ పెరుగుతున్న వైరస్ వ్యాప్తి ఆందోళనకు గురి చేస్తోంది. కేసుల నమోదు కూడా రోజురోజుకు పెరుగుతోంది. వైరస్ వ్యాప్తికి కొత్త స్ట్రెయిన్లు కారణంగా చెబుతున్నారు. దీంతో.. పదునెక్కిన వైరస్ మరింత బలోపేతం కావటంతో కేసుల నమోదుగా భారీగా మారింది. తాజాగా దేశంలో 52 వేల కొత్తకేసులు నమోదు కాగా.. అందులో రెండు రాష్ట్రాల్లోనే అత్యధిక కేసులు నమోదు కావటం గమనార్హం.

దేశ వ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో నమోదైన కేసుల్లో మూడొంతులు రెండు రాష్ట్రాల్లోనే నమోదు కావటంతో ఏం చేయాలో తోచని పరిస్థితి. కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పినా.. వైరస్ వ్యాప్తి అంతకంతకూ ఎక్కువ అవుతోంది. మహారాష్ట్రలో రోజు వ్యవధిలో నమోదైన కేసులు 32వేలు (31,855) కావటం గమనార్హం. అంటే.. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో సగానికి పైగా అక్కడే ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో దాదాపు ఆరు లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఒక అంచనా.

మహారాష్ట్రలోని తొమ్మిది జిల్లాల్లో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఫుణె.. నాగపూర్.. ముంబై.. థానె.. నాసిక్.. ఔరంగాబాద్.. నాందేడ్.. జల్ గావ్.. అకోలా జిల్లాల్లో కేసుల నమోదు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు పంజాబ్ లోనూ పరిస్థితి బాగోలేదని చెబుతున్నారు. ఆ రాష్ట్రంలోని జనాభాకు.. అక్కడ నమోదవుతున్న కేసులకు సంబంధం ఉండటం లేదని.. తీవ్రత ఎక్కువగా ఉన్న విషయం స్పష్టమవుతుందని చెబుతున్నారు. తాజాగా వెలుగు చూస్తున్న లెక్కల ప్రకారం దేశంలో నమోదైన కొత్త కేసుల్లో మహారాష్ట్ర.. పంజాబ్ రెండు చోట్లలో మూడొంతుల కేసులు నమోదు కావటం గమనార్హం.