Begin typing your search above and press return to search.

తలాక్‌ కు వ్య‌తిరేకంగా 50వేల‌ మంది ముస్లిం మ‌హిళలు

By:  Tupaki Desk   |   2 Jun 2016 6:30 AM GMT
తలాక్‌ కు వ్య‌తిరేకంగా 50వేల‌ మంది ముస్లిం మ‌హిళలు
X
మూడు సార్లు తలాక్ అని చెప్ప‌డం ద్వారా విడాకులు తీసుకునే విధానంపై ముస్లిం స‌మాజంలో నిర‌స‌న‌లు పెల్లుబుకుతున్నాయి. ఈ విధంగా తలాక్ ప‌దంతో విడాకులు ఇచ్చే పద్ధతికి వ్యతిరేకంగా 50 వేల మంది ముస్లింలు సంతకాలు చేశారు. మ‌హిళల ఆత్మ‌గౌర‌వానికి - ఆవేద‌న‌కు ఏ మాత్రం విలువ ఇవ్వ‌క‌పోవ‌డం బాధ‌క‌ర‌మ‌ని వారు వాపోతున్నారు. 'భారతీయ ముస్లిం మహిళ ఆందోళన సంస్థ' తలాక్ పద్ధతికి వ్యతిరేకంగా వీరంద‌రినీ జ‌త‌చేసి పోరాడుతోంది. తాజాగా ఈ సంస్థ త‌లాక్‌ పద్ధతి ఖురాన్ కు వ్యతిరేకమని ఆ సంస్థ స్ప‌ష్టం చేసింది. ముస్లిం మ‌హిళ‌ల‌ అభిప్రాయాలను పట్టించుకోవడం లేదని ఆయా వ‌ర్గాల‌కు చెందిన పెద్ద‌ల‌పై ఈ సంస్థ అస‌హ‌నం వ్య‌క్తం చేసింది.

అఖిల భారత ముస్లిం మహిళ పర్సనల్ లాబోర్డ్ అధ్యక్షురాలు షయిషా అంబర్ త‌లాక్‌ పై ఇటీవ‌ల స్పందిస్తూ త‌లాక్ పేరుతో విడాకులు ఇవ్వ‌డం ఇస్లాం వ్యతిరేకమని అన్నారు. ఈ విధానాన్ని నిర్వీర్యం చేయాలని ఆమె పిలుపు నిచ్చారు. ఇది ఒక చెడ్డ సాంప్రదాయం అని పేర్కొన్న ష‌యిషా దానిని రద్దు చేయడానికి తాను అన్ని ప్రయత్నాలు చేస్తానని పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా ముస్లిం మహిళలు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని పేర్కొంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ముస్లిం స‌మాజంలోని కీల‌క‌మైన విధానంపై ప్ర‌ముఖ వ్య‌క్తి ఘాటుగా స్పందించ‌డం ఆ సంప్ర‌దాయంలోని లోపాల‌కు నిద‌ర్శ‌న‌మ‌ని హిందుత్వ‌వాదులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇదిలాఉండ‌గా గ‌త మే నెల‌లో ఓ చిత్ర‌మైన త‌లాక్ కేసు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కిన సంగతి తెలిసిందే. రాజ‌స్తాన్‌ లోని జైపూర్‌ కు అఫ్రీన్‌ రెహ్మాన్‌ (25) ఢిల్లీలో మీడియా వ‌ద్ద త‌న గోడు వెల్ల‌బోసుకుంటూ 'మాట్రిమోనీ పోర్టల్‌ ద్వారా వివాహం కుదుర్చుకుని 2014లో వివాహం చేసుకున్నాను. వివాహం అయిన రెండు మూడు నెలలకే వరకట్నం డిమాండ్‌ చేస్తూ మా అత్తమామలు నన్ను మానసికంగా వేధించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కొట్టడం ప్రారంభించారు. అదే ఏడాది సెప్టెంబరులో ఇంట్లో నుంచి గెంటేశారు. అప్పుడు నేను మా పుట్టింటికి వచ్చేశాను. అయితే షాకింగ్‌ గా స్పీడ్‌ పోస్టులో మా ఇంటికి విడాకులు (తలాక్ అని మూడు సార్లు రాసి ఉన్న ప‌త్రం) పంపించారు' అని ఆమె వాపోయారు. 'ఇది పూర్తిగా అన్యాయం - ఆమోదయోగ్యం కానిది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ నేను సుప్రీంకోర్టును ఆశ్రయించాను' అని అఫ్రీన్‌ చెప్పారు. ఇలాంటి సంద‌ర్భాలున్న నేప‌థ్యంలోనే త‌లాక్‌ పై కోర్టుల‌ను ఆశ్ర‌యిస్తూ ఆందోళ‌న‌లు చేస్తున్నార‌ని తెలుస్తోంది.