Begin typing your search above and press return to search.

ఆధార్ లో వయసు మార్చితే రూ.5వేలు!

By:  Tupaki Desk   |   2 July 2020 6:15 AM GMT
ఆధార్ లో వయసు మార్చితే రూ.5వేలు!
X
కాంగ్రెస్ హయాంలో రూ.200 ఉన్న పింఛన్ ను అంతకు పదిరెట్లు పెంచారు. రూ.2250-3వేల వరకు వివిధ కేటగిరిల్లో ఇస్తున్నారు. జగనన్న చేయూతలో ఏకంగా 18వేలు ఇస్తున్నారు. దాంతో సాఫీగా నెలంతా గ్రామాల్లో బతికేయచ్చు. అందుకే అక్రమార్కులు కొందరు పింఛన్, చేయూత పథకాల కోసం వక్కమార్గం తొక్కుతున్నారు. ఆధార్ కార్డులో వయసును పెంచుకుంటున్నారు. అందుకోసం ఆధార్, మీసేవా కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని నిర్వాహకులు దోచుకుంటున్నారు. ఒక్కొక్కరి వద్ద రూ.5వేలు తీసుకొని వయసు పెంచుతున్నారు. వాటి ఆధారంగా ఫించన్ పొందుతున్నారు. అర్హతలు లేకున్నా లబ్ధి పొందుతున్నారు. ఈ వ్యవహారంలో ఏపీలోని అధికార పార్టీ నేతలు, దళారులు కీలక పాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

ప్రకాశం జిల్లా కనిగిరి కేంద్రంగా ఈ దందా వెలుగుచూసింది. ప్రభుత్వ పింఛన్, జగనన్న చేయూత సహా ప్రభుత్వం సంక్షేమ పథకాలకు వయసు ప్రామాణికం కావడంతో అందరూ ఇప్పుడు ఆధార్ లో 60 ఏళ్లు పైబడిన వయసుకు మారుతున్నారు. 60 ఏళ్లకు వృద్ధాప్య పింఛన్ వస్తోంది. 45-60 వయసు వారికి చేయూత పథకాన్ని అమలు చేస్తున్నారు. దీంతో వయసును మార్చుకుంటూ వక్రమార్గం పడుతున్నారు. వయసు ఎక్కువగా ఉన్నట్టు ఆధార్ లో మార్పులు చేయించుకొని పింఛన్లు పొందుతున్నారు.

కనిగిరి నియోజకవర్గంలో 18000 మంది పింఛన్ లబ్ధిదారులున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏడాదిలో 3వేల మందికి కొత్తగా పింఛన్లు ఇచ్చింది. దీంతో లబ్ధిదారుల సంఖ్య 21వేలకు చేరింది. ఇక జగనన్న చేయూతలో 45-60 ఏళ్లలోపు వారి ఖాతాల్లో ఏడాదికి రూ.18750 జమ చేస్తున్నారు. దీంతో ఆధార్ లో చాలా మంది వయసును పెంచుకునే పనిలో పడ్డారు..

కనిగిరిలో కేవలం పోస్టాఫీస్ - స్టేట్ బ్యాంకు - ఒక మీసేవ కేంద్రానికి మాత్రమే ఆధార్ చేర్పులు - మార్పులకు అవకాశం ఉంది. కానీ వారి లాగిన్ పాస్ వార్డ్ లను ఇతర నెట్ సెంటర్లు - మీసేవలకు ఇచ్చి అక్రమంగా కొందరి వయసు పెంచుతూ దరఖాస్తులు చేస్తున్నారు. ఇందుకోసం ఒక్కో ఆధార్ మార్పుకు రూ.5వేలు తీసుకుంటున్నారు. ఇదో పెద్ద దందాగా కనిగిరిలో సాగుతోంది. కొందరు అధికార పార్టీ నేతలు కూడా ఈ దందాలో ఉన్నట్టు ఆరోపణలున్నాయి.