Begin typing your search above and press return to search.

కడప స్టీల్ ప్లాంట్‌కు రూ.500 కోట్లు ...జగన్ సర్కార్ కీలక నిర్ణయం !

By:  Tupaki Desk   |   16 Jun 2020 7:30 AM GMT
కడప స్టీల్ ప్లాంట్‌కు రూ.500 కోట్లు ...జగన్ సర్కార్ కీలక నిర్ణయం !
X
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం ఈక్విటీ కింద రూ. 500 కోట్లు కేటాయించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై సోమవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, పరిశ్రమల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాల వలవన్‌ సహా పలువురు అధికారులు హాజర‌య్యారు. స్టీల్ ప్లాంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సంస్థతో ఒప్పందం కుదుర్చుకునేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపిస్తుండగా.. వాటితో అధికారులు చర్చలు జరిపారు. హ్యుందాయ్, టాటా స్టీల్స్, ఎస్సార్‌ స్టీల్‌ సహా పలు కంపెనీలతో చర్చలు జరిపామంటూ అధికారులు సీఎంకు పూర్తి వివరాలను తెలిపారు. ఆయా సంస్థలతో మరోసారి చర్చలు జరపాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎంపిక చేసిన భాగస్వామ్య సంస్థతో రెండు నెలల్లోగా ఒప్పందం కుదుర్చుకునేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

ఇక, ఫ్యాక్టరీ నిర్మాణం కోసం అవసరమయ్యే మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు సిద్దం చేయాలని, నెలాఖరులోగా సాయిల్‌ టెస్టింగ్‌, జియో టెక్నికల్‌ సర్వే పూర్తి చేయాలని అధికారులకు సీఎం జగన్ సూచనలు ఇచ్చారు. అదే క్రమంలో రెండేళ్లలో పరిశ్రమ నిర్మాణంలో కీలకమైన టౌన్ షిప్, మౌలిక వసతుల కల్పన దిశగా అడుగులు వేయాలని నిర్దేశించారు. అలాగే, పరిశ్రమ నిర్మాణం కోసం ఈక్విటీ కింద రూ.500 కోట్లు కేటాయించాలని ఆదేశించారు. స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణంలో భాగంగా రోడ్లు, ప్రహరీ గోడ, విద్యుత్‌ సరఫరా నిర్మాణాలు, ఆర్టీపీపీ నుంచి విద్యుత్‌ లైన్‌ నిర్మాణాలు, నీటి సరఫరా.. వంటి పనులు చేపట్టి పూర్తి చేసేదుకు తీసుకుంటున్న చర్యలను పరిశ్రమలశాఖ అధికారులు సీఎం జగన్‌కు వివరించారు.