Begin typing your search above and press return to search.

ఉక్రెయిన్ యుద్ధానికి 50 రోజులు.. తూర్పు వైపే కన్ను

By:  Tupaki Desk   |   15 April 2022 9:59 AM GMT
ఉక్రెయిన్ యుద్ధానికి 50 రోజులు.. తూర్పు వైపే కన్ను
X
ఉన్నట్లుండి ఉరుములా.. పిడుగులా ఉక్రెయిన్ పై విరుచుకుపడింది రష్యా. ఉక్రెయిన్ .. నాటో, ఈయూలో చేరడం ఇష్టం లేని రష్యా తమ దాడికి "సైనిక చర్య" అని పేరుపెట్టింది. అలా ఫిబ్రవరి 24న మొదలుపెట్టని సైనిక చర్య.. యుద్ధంగా మారింది. తొలుత ఉక్రెయిన్‌ సైనిక స్థావరాలే లక్ష్యంగా చేసుకుంటున్నట్లు కనిపించినా.. తర్వాత జనావాసాలపైనా దాడులకు దిగుతోంది. ఈ క్రమంలో అమెరికా, సహా పశ్చిమ దేశాలు రష్యాపై తీవ్ర ఆర్థిక ఆంక్షలకు దిగాయి. అమెరికా అయితే, రష్యాతో ఇంధన సహా సాధారణ వాణిజ్య సంబంధాలనూ తెంచుకుంది. నాటో కూటమి ఉక్రెయిన్ కు ఆయుధ సాయం చేస్తోంది. నానాటికీ ఈ యుద్ధం తీవ్రరూపం దాల్చడమే గాక, వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాల్లో ఒకటైన మేరియుపొల్‌లో ఇప్పటివరకు 20వేల మంది మరణించారు.

పశ్చిమం వదిలి తూర్పు వైపు రష్యా మూడు వైపుల నుంచి ఉక్రెయిన్ పై దాడికి దిగింది. అయితే, పశ్చిమ ప్రాంతంలోని ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను వశం చేసుకోవడంలో విఫలమైంది. అక్కడ ఉక్రెయిన్ సైన్యం నాటో అందించిన ఆయుధాలతో రష్యా దళాలపై తీవ్ర ప్రతిఘటన చూపింది. దీంతో రష్యా తోక ముడవక తప్పలేదు. అయితే, వెనక్కు వెళ్లిన రష్యా సైనికులు.. తూర్పు ఉక్రెయిన్ పై పట్టు కోసం ప్రయత్నిస్తోంది. డాన్ బాస్ (లుహాన్స్క్, డోనెట్స్క్) రీజియన్ హస్తగతానికి యుద్ధాన్ని కొనసాగిస్తోంది. ఈ ప్రాంతంలో రష్యన్ మాట్లాడే ప్రజలు అధికం. కాబట్టే సులువుగా వశం చేసుకోవచ్చని భావిస్తోంది. మరోవైపు రష్యా దాడులను ఉక్రెయిన్‌ సేనలు గట్టిగా ప్రతిఘటిస్తున్నాయి. శత్రువులు అధీనంలోకి తీసుకున్న ప్రాంతాలను ఒక్కొక్కటిగా విడిపించుకుంటున్నాయి. నిన్న నల్ల సముద్రంలో ఉక్రెయిన్‌ జరిపిన క్షిపణి దాడిలో రష్యాకు చెందిన భారీ యుద్ధ నౌక మాస్క్‌వా ఒకటి తీవ్రంగా ధ్వంసమై నీట మునిగింది.

5 రోజుల్లో చుట్టేస్తుందనుకుంటే..?వాస్తవానికి రష్యా ఆయుధ బలగం ముందు ఉక్రెయిన్ తేలిపోతుందని అంతా భావించారు. యుద్ధం కేవలం రోజుల వ్యవధిలో ముగిసిపోతుందని అనుకున్నారు. ఉక్రెయిన్ చేతులెత్తేస్తుందని ఊహించారు. కానీ, అలా ఏమీ జరుగలేదు. 50 రోజులైనా ఉక్రెయిన్ లొంగలేదు. కాకపోతే ఉక్రెయిన్ తీవ్రంగా దెబ్బతిన్నది. పలు నగరాల్లో్ మౌలిక వసతులు కుప్పకూలాయి. గ్రామాల్లో రష్యన్ సైనికులు చేసిన అఘాయిత్యాలు వెలుగులోకి వస్తున్నాయి. మహిళలపై అత్యాచారాలు,.. చిన్నారులపైనా దారుణాలు జరిగిన ఉదంతాలు కనిపిస్తున్నాయి.

కాగా, యుద్ధం 50 రోజులు అయిన సందర్భంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రసంగించారు."చిన్నారులను చంపేశారు. నగరాల ను కూల్చేశారు.. మారణహోమాన్ని సృష్టించారు. దోపిడీలకు తెగబడ్డారు. ఉక్రెయిన్‌లో రష్యా చేయాల్సింది ఇంకేం ఉంది?".. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రపంచాన్ని అడుగుతోన్న ప్రశ్న ఇది. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలై 50 రోజులు అయిన సందర్భంగా జెలెన్‌స్కీ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. శత్రువులకు ఏ మాత్రం వెరవకుండా పోరాటం చేస్తోన్న ఉక్రెయిన్‌ వాసుల ధైర్యాన్ని కొనియాడారు.

యుద్ధాన్ని అడ్డుకునే ధైర్యం తమకు ఉందని, అయితే అందుకు అవసరమైన ఆయుధాలు ఇవ్వాలని ప్రపంచ దేశాలకు మరోసారి విజ్ఞప్తి చేశారు. "ఉక్రెయిన్‌ను లొంగదీసుకునేందుకు 5 రోజులు చాలని దురాక్రమణదారులు భావించారు. కానీ, మా దేశ ప్రజలు తమ జీవితంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అదే పోరాటం. గత 50 రోజులుగా మేం పోరాడుతూనే ఉన్నాం. ఇందుకు చాలా గర్వంగా ఉంది. ఉక్రెయిన్‌ను నాశనం చేయడానికి రష్యా ఎన్ని దురాగతాలకైనా పాల్పడుతోంది. చిన్న పిల్లలను కూడా చంపేస్తున్నారు. నగరాలను సమూలంగా నాశనం చేస్తున్నారు. దొరికింది దొరికినట్లు దోచుకుంటున్నారు. మా దేశంలో రష్యా చేయాల్సిన దారుణాలు ఇంకేం ఉన్నాయి. అయినా మేం వేటికీ భయపడం. ఎందుకంటే, మేం దేనికోసం పోరాడుతున్నామో మాకు స్పష్టంగా తెలుసు. మీరు(ప్రపంచ దేశాలను ఉద్దేశిస్తూ) మాతో కలిసి పోరాడాల్సిన అవసరం లేదు. యుద్ధాన్ని ముగించడానికి కావాల్సినంత ధైర్యం మాలో ఉంది. కానీ, రష్యా మిలిటరీకి మాత్రం అండగా ఉండొద్దు. ఈ పోరాటంలో మాకు కావాల్సిన ఆయుధ సాయం అందించండి చాలు. ఉక్రెయిన్‌కు అండగా నిలవండి" అంటూ జెలెన్‌స్కీ కోరారు.

యూరప్ ను బెదిరిస్తున్న పుతిన్ యూరప్ చమురు, సహజ వాయువు అవసరాలకు రష్యా అత్యంత కీలకం. కాబట్టి రష్యా మీద ఆంక్షలు మీకే నష్టమంటూ ఆయా దేశాలను రష్యా అధ్యక్షుడు పుతిన్ బెదిరిస్తున్నారు. ఎరువులు ధరలు పెరుగుతాయని.. పెట్రోల్ ధరలు మండిపోతాయని.. ప్రజలు ఉపాధి కోల్పోయి వలస వెళ్తారని హెచ్చరిస్తున్నారు. అంటే.. ఉక్రెయిన్ విషయంలో తగ్గేది లేదని చెబుతూనే, ఆ దేశానికి సాయం చేయడం యూరప్ కే దెబ్బని అంటున్నారు.