Begin typing your search above and press return to search.

దారుణ అత్యాచారానికి 5 చెప్పుదెబ్బలతో సరి?

By:  Tupaki Desk   |   1 July 2021 10:30 AM GMT
దారుణ అత్యాచారానికి 5 చెప్పుదెబ్బలతో సరి?
X
ఆడపిల్ల ఆటవస్తువేం కాదు. కామంతో కళ్లు మూసుకుపోయి దారుణ నేరానికి పాల్పడినోడికి.. పంచాయితీ పేరుతో వేసిన శిక్ష గురించి తెలిస్తే.. ఒళ్లు మండిపోవటమే కాదు.. రక్తం మరుగుతుంది. తాజాగా ఒక మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అలాంటి కామాంధుడి తాట తీయాల్సిన గ్రామస్తులు.. అందుకు భిన్నంగా వ్యవహరించారు. ఇప్పుడీ ఉదంతం బయటకు వచ్చి షాకింగ్ గా మారింది. గ్రామ పెద్దల తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇంతకూ అసలేం జరిగిందన్నది చూస్తే..

ఉత్తరప్రదేశ్ లోని మహారాజ్ గంజ్ జిల్లాలోని ఒక చిన్న కుగ్రామంలో మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు అత్యాచారం చేశారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో న్యాయం కోసం అక్కడి స్థానిక పంచాయితీని ఆశ్రయించారు బాధితురాలి తల్లిదండ్రులు. న్యాయం చెప్పాల్సిన పెద్దలు విచిత్రంగా.. దారుణమైన నేరానికి పాల్పడిన యువకుడికి బాధితురాలి చేతిలో ఐదు చెంపదెబ్బలు.. రూ.50వేల పరిహారం తీసుకోవాలని తేల్చేశారు.

ఈ తీర్పును బాధితురాలి కుటుంబం ఒప్పుకోలేదు. న్యాయం జరగాలంటూ పట్టుపట్టారు. దీంతో.. బాధితుల కుటుంబంపై గ్రామ పెద్దలు ఆగ్రహాం వ్యక్తం చేశారు. దీంతో.. వారు న్యాయం కోసం కోతిభార్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అదే సమయంలో బాధితురాలికి జరిగిన అన్యాయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు పోక్సో చట్టం కింద నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని జిల్లా ఎస్పీ ప్రదీప్ వెల్లడించారు. నిజానికి నిందితుడితో పాటు.. దరిద్రపుగొట్టు తీర్పు ఇచ్చిన పంచాయితీ పెద్దలపై కూడా కేసు నమోదు చేసి.. చెత్త పంచాయితీలు చేయకుండా శిక్షలు విధించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వారి వల్లే.. అత్యాచారం లాంటి దారుణం చేసినా కాసిన్ని డబ్బులు.. కూసిన్ని చెప్పు దెబ్బలతో సరిపెట్టొచ్చన్న సందేశం అత్యంత ప్రమాదకరమన్నది మర్చిపోకూడదు.