Begin typing your search above and press return to search.

భారత్ వచ్చే రాఫెల్ యుద్ధ విమానాలు ఇప్పుడెక్కడ?

By:  Tupaki Desk   |   28 July 2020 12:40 PM IST
భారత్ వచ్చే రాఫెల్ యుద్ధ విమానాలు ఇప్పుడెక్కడ?
X
యుద్ధవేళ.. ఆకాశ అద్భుతంగా అభివర్ణించే రాఫెల్ యుద్ధ విమానాలు రేపు (బుధవారం) భారత్ కు చేరుకోనున్నాయి. దీని మీద ఇప్పటివరకూ సాగిన రచ్చను పక్కన పెడితే.. కీలక వేళ.. దేశ రక్షణ రంగంలో భాగం కానున్న ఈ యుద్ధ విమానాల్ని గేమ్ ఛేంజర్ గా పలువురు అభివర్ణించటం తెలిసిందే. ఫ్రాన్స్ సొంతంగా తయారు చేసుకున్న ఈ యుద్ద విమానాన్ని అత్యాధునిక వార్ ఫైటర్ గా చెబుతారు. గడిచిన ఇరవైఏళ్లుగా భారత్ కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురుచూస్తున్న ఈ యుద్ధ విమానం ఇప్పటికి మన అమ్ముల పొదిలో చేరనుంది.

రాఫెల్ రాకతో భారత వైమానిక దశ బలంలో మార్పు కొట్టొచ్చినంతగా మార్పు రానుంది. రేపటికి ఇండియాకు రానున్న ఈ యుద్ధ విమానాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? అన్నదో ప్రశ్న. భారత్ కు చేరుకున్న తర్వాత వీటికిఎక్కడ ఉంచనున్నారు? అన్నది మరో ప్రశ్న. వీటన్నింటికి మించి.. ఫ్రాన్స్ నుంచి భారత్ కు వచ్చే ఈ యుద్ధ విమానాల్ని ఎవరుతీసుకొస్తున్నారు? ఎలా తీసుకొస్తున్నారు? అన్నది అన్నింటి కంటే ఆసక్తికరమైన ప్రశ్న.

బుధవారం భారత్ కు చేరాల్సిన ఈ యుద్ధ విమానాలు ఇప్పటికే బయలుదేరాయి. ఫ్రాన్స్ లోని మెరిగ్నాక్ నుంచి స్టార్ట్ అయిన ఈ యుద్ధ విమానాలు మరి కొద్ది గంటల్లో అరబ్ ఎమిరేట్స్ కు చేరుకోనున్నాయి. అక్కడే ఈ రాత్రి ఉండిపోయి.. రేపు ఉదయం బయులుదేరి భారత్ కు రానున్నాయి.ఇంతకీ ఈ విమానాల్ని నడిపేది కూడా భారతీయ పైలెట్లే కావటం గమనార్హం. మొత్తంగా దేశానికి రావాల్సిన 36 రాఫెల్ యుద్ధ విమానాల్లో తొలి దశలో ఐదు రానున్నాయి.

ఆకాశంలోనే ఫ్యూయిల్ నింపుకునే సామర్థ్యం ఉన్నఈ యుద్ధ విమానాలకు.. భారత్ కు వచ్చే క్రమంలో ఇప్పటికే ఆకాశంలో ఫ్యూయిల్ నింపేశారు కూడా. ఫ్రాన్స్ కు చెందిన రెండు ఫ్యూయిల్ విమానాలు ఇందుకోసం పని చేశాయి. ఇక.. ఈ యుద్ధ విమానాన్ని నడపటం కోసం మన వైమానిక దళ పైలెట్లు ప్రత్యేకంగా శిక్షణ పొందారు. భారత్ కు వచ్చిన తర్వాత వీటిని హర్యానాలో ని అంబాలా వాయుసేన బేస్ కు చేరుకోనున్నాయి. ఎక్కడైతే.. మన అభినవ్ పాక్ యుద్ధ విమానాల్ని ధ్వంసం చేసేందుకు బయలుదేరారో.. ఆ ఎయిర్ బేస్ కు ప్రతిష్ఠాత్మక రాఫెల్ యుద్ధ విమానాలు చేరనున్నాయి. యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఈ యుద్ధ విమానాల కోసం ఎదురు చూస్తోందని చెప్పాలి.