Begin typing your search above and press return to search.

ప్రజాధనం ఫైవ్ స్టార్ హోటళ్ల పాలు!

By:  Tupaki Desk   |   21 July 2015 3:28 PM GMT
ప్రజాధనం ఫైవ్ స్టార్ హోటళ్ల పాలు!
X
రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే, ఎంపీ లను ప్రజాసేవకులని, ప్రజాస్వామ్యం లో పనివారని ఇలా చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్న రాతలు వేరు, వాస్తవంలో జరిగేది వేరు! వారి లైఫ్ స్టైలే కాని, వారికి ప్రభుత్వం ద్వారా అయ్యే ఖర్చులు కానీ సామాన్యుడి ఊహకు దక్కనివి, అంచనాలకు అందనివి! విషయంలోకి వస్తే... ప్రభుత్వ నిర్లక్ష్యమో, లెక్కలేని తనమో కానీ... క్వార్టర్స్ అందించలేని ఒకే ఒక్క కారణంతో 14 నెలల కాలానికి 47 మంది ఎంపీల కోసం సుమారు 24 కోట్ల రూపాయలు స్టార్ హోటళ్ల కు, లగ్జరీ గెస్ట్ హౌస్ లకూ చెల్లించింది! అది ప్రభుత్వ ధనమే కదా అనే అమాయకులుంటే మరోసారి చెప్పుకోవాలి... అది నూటికి నూరు శాతం ప్రజాధనం!

పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికకాబడిన వ్యక్తికి 30 రోజుల్లోగా ఢిల్లీలో వసతి సౌకర్యం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిది! అలా వారికి సమకూర్చలేని పక్షంలో వారి వారి ఫైవ్ స్టార్ హోటళ్ల కు, లగ్జరీ గెస్ట్ హౌస్ లకూ అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే చెల్లించాలి! భోజనం ఖర్చు మాత్రం సదరు ఎంపీలు భరిస్తే చాలు! అయితే ఈ 47 మందిలో కొంతమందికి క్వార్టర్లను కేటాయించినా, (ప్రజాసేవ చేయడానికి) అవి అనుకూలంగానూ సౌఖ్యంగానూ లేవనే కారణంతో ఫైవ్ స్టార్ హోటళ్లలోనే నివసిస్తున్నారు. అత్తసొమ్ము అల్లుడు దారేసినట్లు... ప్రజాధనాన్ని ప్రభుత్వం ఫైవ్ స్టార్ హోటళ్ల పాలు చేస్తుందన్న మాట! ఈ విషయలు సుభాస్ చంద్ర అగర్వాల్ అనే పౌరుడు దాఖలు చేసిన సమాచార హక్కు దరఖాస్తు ద్వారా వెల్లడయ్యాయి!