Begin typing your search above and press return to search.

భారత్ లో ట్రంప్ క్రేజ్ ఎంతో తెలిసే ఫిగర్స్ బయటకు

By:  Tupaki Desk   |   28 Feb 2020 10:50 AM IST
భారత్ లో ట్రంప్ క్రేజ్ ఎంతో తెలిసే ఫిగర్స్ బయటకు
X
ఎందుకొచ్చాడో తెలీదు? ఎందుకంత హడావుడో అర్థం కాదు. ఊహించని రీతిలో ఫిక్స్ అయిన ట్రంప్ భారత్ టూర్.. చూస్తుండగానే ఆయ్యవారు రావటం..వెళ్లిపోవటం జరిగిపోయాయి. ట్రంప్ వారి టూర్ సందర్భంగా వందల కోట్ల రూపాయిల్ని ఖర్చు చేయటమే కాదు.. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయటం.. ఘనంగా అతిధ్యాన్ని అందించటం తెలిసిందే. తన భారత పర్యటనపై మస్తు ఖుషీగా ఉన్నారు ట్రంప్ వారు.

మరికొద్ది నెలల్లో అమెరికా ఎన్నికలు జోరందుకోనున్న వేళ సాగిన ట్రంప్ పర్యటన కారణంగా మోడీ సర్కారు కు ఒరిగిన ప్రయోజనం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అగ్రరాజ్యాధిపతి పర్యటన నేపథ్యంలో ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు మోడీ సర్కారుకు మచ్చగా మారతాయనటంలో సందేహం లేదు.

ఇదిలా ఉండగా.. ట్రంప్ భారత పర్యటన సందర్భంగా భారతీయుల్లో ఆసక్తి ఎంత వ్యక్తమైందన్న విషయానికి సంబంధించిన గణాంకాలు తాజాగా బయటకు వచ్చాయి. ముఖ్యంగా.. ట్రంప్ పర్యటనలో హైలెట్ అయిన అహ్మదాబాద్ మెటేరా స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని భారీ ఎత్తున భారతీయులు వీక్షించిన వైనం బయటకు వచ్చింది.

లక్షకు పైనే ప్రజలు ఈ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరు కావటం ఒక ఎత్తు అయితే.. ఇంత భారీ జనసందోహం తమ సభకు రావటం పై ట్రంప్ దంపతులు మస్తు ఖుషీ అయ్యారని చెప్పాలి. ఇదిలా ఉంటే.. అందరిలో ఆసక్తి రేపిన ఈ సభను దేశ వ్యాప్తంగా 4.6 కోట్ల మంది వీక్షించినట్లుగా బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ వెల్లడించింది.

దేశ వ్యాప్తంగా 180 చానల్స్ ఈ కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేసినట్లు గా పేర్కొంది. ఇటీవల కాలంలో ఒక కార్యక్రమాన్ని అత్యధికం గా వీక్షించిన జాబితాలో ఈ కార్యక్రమం చేరినట్లుగా చెబుతున్నారు. భారత్ లో జరిగిన తన పర్యటన పై భారతీయుల్లో ఎంత ఆసక్తి వ్యక్తమైందన్న విషయాన్ని వెల్లడించే ఈ ఫిగర్స్ ట్రంప్ కు సంతోషాన్ని కలిగించటమే కాదు.. తనకున్న క్రేజ్ పై ఆయన గొప్పలు పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదేమో?