Begin typing your search above and press return to search.

45,500 ఏళ్లనాటి పెయింటింగ్ దొరికింది.. ఆ జాతి ఇంకా ఉంది!

By:  Tupaki Desk   |   16 Jan 2021 1:30 AM GMT
45,500 ఏళ్లనాటి పెయింటింగ్ దొరికింది.. ఆ జాతి ఇంకా ఉంది!
X
ఒకటీ రెండు కాదు.. వంద.. రెండొందలు కానేకాదు.. 45వేల 500 సంవత్సరాల నాటి పెయింటింగ్ ను కనుగొన్నారు శాస్త్రవేత్తలు! ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతన పెయింటింగ్ గా ఆర్కియాలజిస్టులు భావిస్తున్నారు. ఆ బొమ్మ దేనికి సంబంధించినదంటే.. అదొక అడవి పంది చిత్రం. ముదురు ఎరుపు రంగులో ఉన్నదా పెయింటింగ్. ఇప్పుడు మనం ఎలా ఆలోచిస్తామో.. అలాగే ఆలోచించి బొమ్మలు వేశారన్న నిపుణులు.. దాన్ని మోడ్రన్ ఆర్ట్ గా కీర్తిస్తున్నారు.

ఎక్కడ..?
ఈ పెయింటింగ్ ను ఇండోనేషియాలోని ఓ గుహలో కనుగొన్నారు. సులవేసి అనే ద్వీపంలోని మారుమూల లోయలో ఉన్నదీ ప్రాంతం. అక్కడ ‘లియాంగ్ టెడాంగ్‌గే’ అనే పేరుతో పిలవబడే గుహలో ఈ పెయింటింగ్ కనుగొన్నారు.

ఎలా ఉంది?
గుహలోని రాతిపై అడవి పంది బొమ్మను చిత్రించారు. 136 సెంటిమీటర్ల వెడల్పు, 54 సెంటీమీటర్ల పొడవు ఉందీ బొమ్మ. ముదురు ఎరుపు రంగు ద్రవం వాడి బొమ్మ వేసినట్టు గుర్తించారు. ఆ పెయింట్లో రెండు కొమ్ములు కూడా ఉన్నాయి. చిత్రం పైన మనుషుల చేతిముద్రలు కూడా ఉన్నాయి. మరో రెండు పందుల పెయింటింగ్స్ కూడా ఉన్నప్పటికీ.. అవి స్పష్టంగా కనిపించట్లేదని తెలిపారు.

ఎప్పుడు గుర్తించారు?
ఈ చిత్రాన్ని 2017లో బస్రన్ బుర్హన్ అనే డాక్టోరల్ స్టూడెంట్ గుర్తించాడు. ఆ తర్వాత ఇండోనేషియా ప్రభుత్వాన్ని సంప్రదించామని గ్రిఫిత్ యూనివర్సిటీ రైటర్ మ్యాక్సిమ్ ఆబర్ట్ తెలిపారు. ఈ పెయిటింగ్ ద్వారా.. ఆ ప్రాంతంలో తొలి మానవ మనుగడ ఎప్పుడనేది గుర్తించవచ్చని అభిప్రాయపడుతున్నారు.

అక్కడికి వెళ్లడం కష్టం..
ఐలాండ్లోని అత్యంత వెనుకబడి ప్రాంతంలో ఈ గుహ ఉంది. అక్కడికి వెళ్లాలంటే రోడ్డు లేదు. కష్టంగా ఉండే కాలిబాటపై కొన్ని గంటలపాటు నడిస్తే తప్ప, ఆ గుహ వద్దకు చేరుకోలేరు. ఎటువంటి వాహనాలూ ఆ దారి వెంట వెళ్లటానికి వీలులేదని నిపుణులు తెలిపారు. అంతేకాదు.. ఆ గుహకు కేవలం వేసవికాలంలోనే వెళ్లగలరు. వర్ష, శీతాకాలాల్లో అక్కడ విపరీతమైన వరదలు ప్రవాహిస్తుంటాయి. అక్కడ ఇప్పటికీ ఆ జాతి ప్రజలు నివసిస్తున్నారు. వారికి బాహ్య ప్రపంచంతో సంబంధాల్లేవు. వాళ్లు ఎంత పురాతన కాలంలో నివసిస్తున్నారంటే.. తాము ఎప్పుడూ నాగరికుల(వెస్ట్రన్స్)ను చూడలేదని చెప్పారట అక్కడ నివసించే బర్గీస్ జాతి ప్రజలు.

మరింత పాతది కావొచ్చు..
ఈ పెయింటింగ్ పై అబర్ట్ అనే డేటింగ్ స్పెషలిస్ట్ (కాలాన్ని అంచనా వేసే నిపుణుడు) మాట్లడారు. ఈ పెయింటింగ్ 45వేల సంవత్సరాల కింద వేసిందేనని చెప్పిన ఆయన.. ఆ చిత్రం వయసు అంతకన్నా ఎక్కువే ఉండొచ్చని అన్నారు. యూరేనియం సిరీస్ ఇస్టోప్ డేటింగ్ సాయంతో 45వేల 500 ఏళ్లనాటిదని అంచనా వేస్తున్నామన్నారు. దీనిపై ఇంకా పరిశోధనలు జరిగితే మరింత స్పష్టత వస్తుందని తెలిపారు.

మనలాగే ఆలోచించారు..
ఈ పెయింటింగ్ వేసిన వారు ఎంతో మోడ్రన్గా మనలాగే ఆలోచించారని అబర్డ్ అన్నారు. 45 వేల ఏళ్ల క్రితమే మనలా ఆలోచించారని కొనియాడారు. కేవ్ పెయింటింగ్ల ద్వారా మానవుల వలసలపై లోతుగా పరిశోధనలు చేస్తే మరింత స్పష్టం వచ్చే అవకాశం ఉందని అబర్డ్ అన్నారు. కాగా.. ఆ అడవి పందుల బొమ్మలపై ఉన్న మనుషుల చేతి ముద్రలతో డీఎన్ఏను విచ్ఛిన్నం చేయగలం అంటున్నారు. అది జరిగితే మానవ జీవితంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది.