Begin typing your search above and press return to search.

ఢిల్లీలో ఘోర కలి.. 43మంది మృతి!

By:  Tupaki Desk   |   8 Dec 2019 5:21 AM GMT
ఢిల్లీలో ఘోర కలి.. 43మంది మృతి!
X
దేశ రాజధాని ఢిల్లీ ఘోర ప్రమాద వార్తతో నిద్రలేచింది. అగ్ని కీలలకు ఏకంగా 43మందికి పైగా మరణించినట్టు తెలిసి అంతటా విషాదం అలుముకుంది. ఆదివారం ఉదయం ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. న్యూఢిల్లీలోని ఆనాజ్ మండిలో ఓ స్కూలు బ్యాగులు, ప్లాస్టిక్ బ్యాగుల తయారీ కంపెనీలో ఈ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏకంగా 43 మంది మరణించడం కలిచివేసింది. పలువురు మంటల్లో చిక్కుకున్నారు. చాలా మంది దట్టమైన అగ్ని పొగలకు ఊపిరి ఆడక చనిపోయినట్లు తెలిసింది. దాదాపు 50 మందిని ఈ ప్రమాదం నుంచి రక్షించారు. పదుల సంఖ్యలో ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలిసింది.

ఢిల్లీలోని అనాజ్ మండిలోని స్కూల్ బ్యాగ్స్, బాటిల్స్ తయారీ కంపెనీలో మంటలు అంటుకున్నాయి. అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో భవనంలో సుమారు 30కుపైగా కార్మికులు నిద్రిస్తున్నారు. ఆదివారం ఉదయం ఐదున్నర గంటల సమయంలో ఈ మంటలు వ్యాపించినట్టు అధికారులు చెబుతున్నారు. పక్క భవనాలకు కూడా మంటలు వ్యాపించి ప్రాణ నష్టం పెరిగింది.

ఈ ప్రమాదంలో సుమారు 43 మంది మరణించగా.. 15మందిని ఢిల్లీలోని ఎల్ఎన్జీపీ ఆస్పత్రికి తరలించి చికిత్స నందిస్తున్నారు. 50మందిని రక్షించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

మంటలు వ్యాపించిన భవనంలో స్కూల్ బ్యాగ్ లు పెద్ద మొత్తంలో ఉండడంతో శరవేగంగా విస్తరించాయని అధికారులు తెలిపారు. స్థానికులు ఫైరింజన్ కు సమాచారం ఇవ్వడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు.

ఢిల్లీలో ఘోర ప్రమాదంపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.