Begin typing your search above and press return to search.

ఆస్తి, చెత్తపై పన్నులు.. ప్రజలపై 426 కోట్ల భారం?

By:  Tupaki Desk   |   4 Aug 2021 10:37 AM GMT
ఆస్తి, చెత్తపై పన్నులు.. ప్రజలపై 426 కోట్ల భారం?
X
ప్రజలపై సరికొత్త పన్నుల భారం మోపుతోంది ఏపీ ప్రభుత్వం.. కాదేది పన్నుకు అనర్హం అంటూ వాయించేస్తోంది. పన్నుల మీద పన్నులు వేస్తూ ఆఖరుకు చెత్తపై కూడా పన్ను వేస్తోంది. ఇది ప్రజలపై పెను భారంగా తయారయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ఆస్తి పన్ను, చెత్తపై విధిస్తున్న రుసుముల ద్వారా పట్టణ ప్రజలపై భారీగా భారం పడనుంది. దాదాపు అన్ని పట్టణ స్తానిక సంస్థల్లోనూ ఈ రెండు ప్రతిపాదనలను అధికార పార్టీ ఆమోదిస్తోంది. దీంతో నూతన విధానం ప్రకారం పట్టణ, నగర ప్రజలపై ఆస్తి పన్ను భారం రూ.186 కోట్లు, చెత్తపై వేస్తున్న రుసుముల భారం ఏటా రూ.240 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీన్ని ఏడాదికి రూ.426 కోట్ల అదనపు భారం పడనుందన్న మాట..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రజలపై భారం పడుతోంది..ఇటీవలే ఏపీ ప్రభుత్వం ఆస్తి పన్ను చట్టానికి సవరణలు చేసింది. 2021-22 ఏడాది నుంచి రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా ఆస్తి పన్ను లెక్కిస్తారు. ఈ మేరకు పురపాలక శాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది.

ప్రభుత్వం ఇకపై రిజిస్ట్రేషన్ విలువ సవరించిన ప్రతిసారి ఆస్తి పన్ను పెరుగనుంది. రిజిస్ట్రేషన్ విలువ ఆధారిత పన్ను 10శాతం కంటే ఎక్కువగా ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. సవరించిన మేరకు ధార్మిక, విద్య, వైద్య, సాంస్కృతిక కట్టడానికి ఆస్తిపన్నును మినహాయించారు. సైనికులు, మాజీ సైనికుల గృహాలకు కూడా ఆస్తి పన్ను నుంచి వెసులుబాటు కల్పించారు.

375 చదరపు అడుగుల లోపు భవనాలకు వార్షిక ఆస్తిపన్ను రూ.50 అని నిర్ధారించారు. భవన శైలి ఆధారంగా ఆస్తి విలువ ఖరారు చేస్తారు. ఇల్లు డిజైన్ బట్టి పన్ను వడ్డించనున్నారు. ఆర్సీసీ, రేకులు, పెంకులు, నాపరాళ్లు, పూరిళ్లకు ఆస్తిపన్నును వర్గీకరించారు. ఆస్తిపన్ను నిర్ధారించే క్రమంలో అక్రమ కట్టడాలకు 25-100శాతం జరిమానా విధిస్తారు. నమూనా మారినా.. నిర్మాణ పెరిగిన భారీ జరిమానాలు ఉంటాయి. ఎంత అక్రమ నిర్మాణం ఉంటే అంతే భారీగా జరిమానాలు ఉంటాయి.

అంటే దీన్ని బట్టి ధనవంతుల ఇళ్లకు పన్ను మోత మోగనుంది. సామాన్యులకు పన్ను మినహాయింపు లభించే ఛాన్స్ ఉంది. అయితే కొత్త ఆస్తి, చెత్తపై పన్నులు మాత్రం పట్టణ ప్రజలపై తీవ్రంగా భారం మోపుతున్నాయి. ఈ విధానంతో కోట్ల రూపాయల భారం ప్రజల నెత్తిన పడుతోంది. దీనిపై ఇప్పటికే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినా ఏపీ ప్రభుత్వం మాత్రం అమలుచేయాలనే చూస్తోంది.కానీ ప్రతిపక్షాలు, ప్రజలు మాత్రం ఈ అంచనాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం ఆస్తి, చెత్త పై పన్నులను సమీక్షించాలని..ఇప్పటికైనా ప్రజలపై భారం తగ్గించాలని యోచిస్తున్నారు.