Begin typing your search above and press return to search.

మంత్రి కారుకు 41 చ‌లాన్లు..సామాన్యుడి ట్వీట్ అస్త్రం!

By:  Tupaki Desk   |   1 July 2019 8:39 AM GMT
మంత్రి కారుకు 41 చ‌లాన్లు..సామాన్యుడి ట్వీట్ అస్త్రం!
X
సోష‌ల్ మీడియా అందుబాటులోకి వ‌చ్చాక సామాన్యుడి చేతికి ఒక ఆయుధం దొరికిన‌ట్లైంది. అత్యుత్త‌మ స్థానాల్లో ఉన్న వారిని నేరుగా ప్ర‌శ్నిస్తున్న తీరు కొన్నిసార్లు సంచ‌ల‌నంగా మారుతోంది. తాజాగా అలాంటి ఉదంత‌మే ఒక‌టి చోటు చేసుకుంది. సామాన్యుడి వాహ‌నాల‌కు నాలుగు చ‌లాన్లు పెండింగ్ లో ఉన్నంత‌నే బండిని ఆపేసి.. ముక్కుపిండి డ‌బ్బులు వ‌సూలు చేసే పోలీసులు తెలంగాణ మంత్రుల వాహ‌నాల‌కు పెండింగ్ లో ఉన్న చ‌లానాల ప‌రిస్థితి ఏమిటంటూ సైబ‌రాబాద్ పోలీసుల‌కు ఒక సామాన్యుడు ట్వీట్ చేశారు.

మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ వాహ‌నానికి 41 చ‌లానాలు పెండింగ్ లో ఉన్నాయ‌ని.. ఆయ‌న మీద ఎలాంటి చ‌ర్య తీసుకోరేం అన్న విష‌యాన్ని ట్వీట్ ప్ర‌శ్న‌తో సంధించారు. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం శ్రీ‌నివాస్ గౌడ్ వాహ‌నం మీద 41 చ‌లానాలు.. ఆయ‌న శ్రీ‌మంతి శార‌ద వినియోగించే కారుకు 14 చ‌లానాలు పెండింగ్ లో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. ఇందులో మంత్రిగారి చ‌లానాల మొత్తం రూ.46,535 ఉంద‌ని.. ఆయ‌న శ్రీ‌మ‌తి వాహ‌నం మీద ఉన్న చ‌లానాల మొత్తం రూ.16,339 వ‌ర‌కు ఉన్న‌ట్లు చెబుతున్నారు. మ‌రింత ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే..ఈ చ‌లానాల మొత్తం 2016-17 నుంచి పెండింగ్ లో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.

నిబంధ‌న‌ల ప్ర‌కారం ఏదైనా వాహనం మీద ప‌ది చలానాలు ప‌డితే.. అత‌న్ని ట్రాఫిక్ నిబంధ‌న‌ల్ని త‌ర‌చూ ఉల్లంఘించే ఘ‌నుడిగా చెబుతారు. ఈ లెక్క‌న మంత్రిగారి వాహ‌నంమీద ఉన్న చ‌లానాల మాటేమిటి? అన్న‌ది ప్ర‌శ్న‌. ఇదిలా ఉంటే.. చ‌లానాలు అత్య‌ధికంగా ఉన్న వాహ‌నాల్ని ట్రేస్ చేసే విష‌యం మీద పోలీసు విభాగం వారు క‌వ‌రింగ్ చేస్తూ.. వాహ‌నాన్ని ట్రేస్ చేసే ప‌నిలో ఉన్న‌ట్లు చెప్పారు. దీనికి సామాన్యుడు కౌంట‌ర్ ఇస్తూ.. స‌ద‌రు నేత‌కు మీరే సెక్యురిటీ ఇస్తారు. మీరే.. వాహ‌నాన్ని గుర్తించాలంటారు.. ఏమిటీ విష‌యం? అంటూ సంధించిన ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొందంటున్నారు. ఈ ఇష్యూ మ‌రింత ర‌చ్చ కాక ముందే మంత్రివ‌ర్యులు త‌మ పెండింగ్ చ‌లానాలు క్లియ‌ర్ చేస్తే మంచిదేమో? ప‌నిలో ప‌నిగా.. మంత్రుల‌తో పాటు అధికార‌పార్టీ ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు అంతా త‌మ వాహ‌నాల మీద ఉన్న చ‌లానాల మొత్తం పెండింగ్ ఎంతుందో లెక్క తేల్చేసుకోవ‌టం మంచిదన్న అభిప్రాయం వ్య‌క్త‌మవుతోంది.