Begin typing your search above and press return to search.

40 ఇయర్స్ పాలిటిక్స్: టీడీపీకి భవిష్యత్ ఎవరు?

By:  Tupaki Desk   |   29 March 2021 5:00 PM IST
40 ఇయర్స్ పాలిటిక్స్: టీడీపీకి భవిష్యత్ ఎవరు?
X
స్వర్గీయ నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి నేటికి సరిగ్గా 40 ఏళ్లు నిండాయి. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీకి చరమగీతం పాడి అధికారంలోకి వచ్చిన ఘనుడు ఆయన. ఆ తర్వాత ఎన్నో ఆటుపోట్లు, వెన్నుపోట్లతో ఆ పార్టీని చంద్రబాబు హస్తగతం చేసుకున్నారు. కానీ తెలుగు తెరపై తారకరాముడు చేసిన సంస్కరణలు, పాలన వైభవం ఇప్పటికీ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోతోంది.

అనాదిగా అవినీతి, ఆశ్రిత పక్షపాతంతో మగ్గిపోయిన కాంగ్రెస్ పార్టీని ఓడించాలని ఎన్టీఆర్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. ప్రజల నమ్మకాన్ని ఎన్టీఆర్ ఏనాడు వమ్ము చేయలేదు. ఎన్నో బానిస వ్యవస్థలను రూపుమాపి.. యువతను రాజకీయాల్లో తీసుకొచ్చి ఎంతో మంది ఇప్పటి టీడీపీ నేతలకు లైఫ్ ను ఇచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్. మండల వ్యవస్థ ఏర్పాటు, తాలూకాల రద్దు, పేదలకు సంక్షేమ పథకాలు, బీసీలకు రాజకీయ అవకాశాలు ఇవ్వడానికి తెలుగుదేశాన్ని ఒక పార్టీగా మలిచిన నేత ఎన్టీఆర్ మాత్రమే. కులాల కంపులను తొలగించిన ఘనుడాయన..

ఇక ఎన్టీఆర్ నుంచి పార్టీని తన చేతుల్లోకి తీసుకున్న చంద్రబాబునాయుడు అందులో అసలు నందమూరి కుటుంబం ఫ్లేవర్ లేకుండా చేసేశాడు. హైటెక్ పాలనతో ఆదిలో అలరించి.. తర్వాత రైతు వ్యతిరేకిగా మారి.. కొన్ని ఆధునిక పద్ధతులతో ప్రజల్లో నానారు. పరిపాలనలో కొత్త పద్ధతులు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుదే. తెలంగాణ విభజన సమయంలో చంద్రబాబు 'రెండు కళ్ల సిద్ధాంతం'తో చాకచక్యంగా రాజకీయం నడిపారు. రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించడంలో చంద్రబాబును మించిన నేత లేరనడంలో ఎలాంటి సందేహం లేదు. అలానే 2014లో ఏపీలో బీజేపీ-జనసేనతో టీడీపీ అధికారంలోకి తీసుకొచ్చారు.

అయితే టీడీపీ భవిష్యత్ ఇప్పుడు అంధకారంలో పడబోతోంది. బలమైన జగన్ దూకుడు ముందు చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం పాతతరం రాజకీయాలు వెలవెలబోతున్నాయి. చంద్రబాబుకు వృద్ధాప్యం మీదపడడం.. ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకోలేని లోకేష్ బాబు మరోవైపు ఉండడం కూడా టీడీపీకి మైనస్ గా మారింది. 2024 వరకు చంద్రబాబు వయసు మరీ ఎక్కువ అవుతుంది. అప్పుడు రాకుంటే ఇక చంద్రబాబు రాజకీయాల్లో రిటైర్ అయినట్టే. లోకేష్ వల్ల కాదని తెలుగు తమ్ముళ్లే చెబుతున్న వేళ జూనియర్ ఎన్టీఆర్ వస్తారా? టీడీపీని టేక్ ఓవర్ చేస్తాడా? లోకేష్ పరిస్థితి ఏంటన్నది వేచిచూడాలి.