Begin typing your search above and press return to search.

తెలంగాణలో ఆ యువతికి కరోనా.. లెక్కల్లో మునిగిన అధికారులు

By:  Tupaki Desk   |   16 March 2020 7:45 AM GMT
తెలంగాణలో ఆ యువతికి కరోనా.. లెక్కల్లో మునిగిన అధికారులు
X
కాస్త జ్వరం.. మరికాస్త దగ్గు.. ఇంకాస్త ఊపిరి తీసుకోవటం కష్టంగా ఉంటే చాలు.. గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కొందరికి సమస్య ఉండి సందేహం వస్తే.. మరికొందరికి అదే పనిగా కరోనాకు సంబంధించిన సమాచారం అదే పనిగా వింటూ.. తమకు తాము అలాంటి సమస్యల్లోకి కూరుకుపోయామా? సందేహంలోనూ లేని సమస్యను ఊహించుకున్నోళ్లకు కొదవ లేదు. అయితే.. ఈ కన్ఫ్యూజన్ లో కాస్త సానుకూలాంశం ఏమంటే.. విదేశాల నుంచి ఇటీవల కాలంలో హైదరాబాద్ కు వచ్చి.. కరోనా లక్షణాలు కనిపించినంతనే ఆసుపత్రులకు వెళుతున్న తీరును అభినందించాల్సిందే.

తాజాగా.. హైదరాబాద్ కు చెందిన 24 ఏళ్ల యువతికి కరోనా పాజిటివ్ అని తేలటం తెలిసిందే. ఇటీవల ఆమె ఇటలీ నుంచి హైదరాబాద్ కు వచ్చారు. జ్వరంతో ఇబ్బంది పడుతున్న ఆమె గాంధీలో పరీక్షల కోసం వెళ్లగా.. ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఉలిక్కిపడిన అధికారులు వెంటనే స్పందించి.. ఆమె తల్లిదండ్రుల రక్త నమూనాల్ని సేకరించారు.

అదే సమయంలో.. జ్వరానికి ముందు ఆమె ఎవరెవరిని కలిశారు? ఎక్కడెక్కడ తిరిగారు? లాంటి సమాచారాన్ని సేకరిస్తున్నారు. గడిచిన కొద్ది రోజులుగా ఆమె ఎవరిని కలిశారు? ఎక్కడకు వెళ్లారు? లాంటి సమాచారంతో వారందరిలోనూ కరోనా లక్షణాలు ఏమైనా ఉన్నాయా? అన్న విషయాన్ని క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. దీంతో.. కరోనా పాజిటివ్ గా తేలిన యువతితో మాట్లాడి.. సమాచారాన్ని సేకరిస్తున్నారు.

ఇప్పటివరకూ అందుతున్న సమాచారం ప్రకారం ఆమె కలిసిన వారిలో 30 మందిని గుర్తించారు. వెంటనే వారికి సమాచారం ఇచ్చి.. ఎవరికి వారిని ఇంటి వద్దనే ఐసోలేషన్ లో ఉండాలని.. జ్వరం.. దగ్గు.. జలుబు తీవ్రతను గుర్తించి వెంటనే ఆసుపత్రికి సమాచారం ఇవ్వాలన్న సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో.. గుర్తించిన ముప్ఫై మందికి రక్త నమూనాలు సేకరించాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తంగా చూసినప్పుడు సదరు అమ్మాయి ఎవరిని కలిశారన్న దానికి సంబంధించిన లెక్కల్లో అధికారులు మునిగి తేలుతున్నట్లుగా తెలుస్తోంది.