Begin typing your search above and press return to search.

గుజరాత్ ఎన్నికల బరిలో 397 మంది కోటీశ్వర్లు

By:  Tupaki Desk   |   9 Dec 2017 1:08 PM IST
గుజరాత్ ఎన్నికల బరిలో 397 మంది కోటీశ్వర్లు
X
రాజకీయాలు శక్తివంతమైనవి. కానీ ఆ శక్తిని డబ్బులు శాసిస్తున్నాయా? రాజకీయాల్లో కోటీశ్వరుల ప్రాతినిధ్యం పెరుగుతోందా? గుజరాత్‌ లో ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులను చూస్తే ఇది నిజమేనని తేలుతోంది. ఎందుకంటే...గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో వందల మంది కోటీశ్వర్లు పోటీ పడుతున్నారు. దేశంలో మనీ - రాజకీయాల మధ్య సంబంధం బహిరంగ రహస్యమే. గుజరాత్‌ లో అది ఒక అర్హత కూడా మారినట్టు ఈ గాణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.182 అసెంబ్లీ స్థానాలకు గానూ.. 1,828 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. ఇందులో 397 మంది కోటీశ్వర్లు ఉన్నట్లు తేలింది. ఇక 1,098 మంది అబ్యర్థులు 12వ తరగతి కంటే ఎక్కువ చదవలేదు. 118 మంది మహిళలు పోటీలో ఉన్నారు. ఈ వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) - గుజరాత్ ఎలక్షన్ వాచ్(జీఈడబ్ల్యూ) సంస్థలు వెల్లడి చేశాయి.

తొలి దశలో 89 స్థానాలకు 977 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. అందులో 198 మంది కోటీశ్వర్లు ఉన్నారు. వీరంతా కోటీ రూపాయాలకు పైగానే ఆస్తులున్నట్లు తమ ఆఫిడవిట్లలో పేర్కొన్నారు. రెండో దశలో 93 స్థానాలకు గానూ 851 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో 199 మంది అభ్యర్థులు కోటీశ్వర్లు ఉన్నారు. 397 మంది కోటీశ్వర్లలో 131 మంది కోటీశ్వర్లు రూ. 5 కోట్లకు పైగా ఆస్తులను కలిగి ఉన్నారు. మరో 124 మంది కోటీశ్వర్లు రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్ల ఆస్తులు(చరాస్తులు - స్థిరాస్తులు కలిపి) కలిగి ఉన్నారు. అయితే బీజేపీ నుంచి 142 మంది కోటీశ్వర్లు - కాంగ్రెస్ నుంచి 127 మంది - ఎన్సీపీ నుంచి 17 మంది - ఆప్ నుంచి 13 మంది - బీఎస్పీ నుంచి ఐదుగురు కోటీశ్వర్లు ఉన్నారు. వీరితో పాటు 56 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా కోటీశ్వర్ల జాబితాలో ఉన్నట్లు తేలింది.

కాంగ్రెస్‌ నుంచి పోటీలో ఉన్న వారు 70 శాతం మంది కోట్లకు పడగలెత్తినవారే. అహ్మదాబాద్‌ లోని దస్క్‌ రోయ్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీలో ఉన్న పటిదార్‌ పంకజ్‌ పటేల్‌ అధికారికంగా ప్రకటించిన ఆస్తి విలువ రూ. 231 కోట్లు. ముగ్గురు కాంగ్రెస్‌ - ఇద్దరు బీజేపీ అభ్యర్థుల ఆస్తులు రూ. 100 కోట్లకుపైనే ఉన్నాయి. రాజ్‌ కోట్‌ పశ్చిమ స్థానం నుంచి ముఖ్యమంత్రి విజరురుపానీపై పోటీలో ఉన్న రాజ్‌ గురు ఇంద్రనీల్‌ కూడా రూ. 100 కోట్ల క్లబ్‌ లో ఉన్నారు. రుపాణీ తన ఆస్తి 3.4 కోట్లుగా ప్రకటించగా, ఇంద్రనీల్‌ ఆస్తి 141 కోట్లుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 100 కోట్ల క్లబ్‌లో ఉన్న సౌరభ్‌ పటేల్‌ (123) కోట్లు మోడీ క్యాబినెట్‌ లో మంత్రిగా పనిచేశారు.

కాగా, బీజేపీకి చెందిన ధన్జిభాయ్‌ పటేల్‌ సురేంద్రనగర్‌ జిల్లా వాద్వానా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇతని ఆస్తి రూ. 113 కోట్లు - చనస్మా స్థానం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీలో ఉన్న రఘుభాయ్‌ దేశాయ్‌ ఆస్తి రూ. 108 కోట్లు.. సౌరభ్‌ పటేల్‌ ఆస్తులు 2012లో ప్రకటించిన రూ. 57 కోట్ల నుంచి 2017 నాటికి రెట్టింపు అయ్యాయి. అతని ఆస్తుల విలవు రూ. 123 కోట్లుగా తాజా అఫిడవిట్‌ లో పేర్కొన్నారు. ఈయన వడోదరలోని అకోట నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. ల్యాండ్‌ డీలర్‌ - బిల్డర్‌ అయిన సౌరభ్‌ పటేల్‌ వ్యవసాయం తన ఆదాయ వనరుగా పేర్కొన్నారు. సౌరభ్‌ పటేల్‌ అహ్మదాబాద్‌ లో వ్యాపారవేత్త కావడం గమనార్హం.