Begin typing your search above and press return to search.

ఓటుకు 30 వేలు.. తెలంగాణ ఎన్నికల సిత్రం

By:  Tupaki Desk   |   22 Jan 2020 5:10 AM GMT
ఓటుకు 30 వేలు.. తెలంగాణ ఎన్నికల సిత్రం
X
కట్టల కట్టలు పైసలు పంచితే దొరికి పోతారు.. పోనీ వాటిని బ్యాంకుల నుంచి తీసుకొద్దామన్నా పోలీస్ చెకింగ్ ల్లో పట్టుకుంటారు.. మరి ఏం చేయాలి? తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు ఎలా పంచాలి? అప్పుడే వచ్చింది ఓ ఐడియా.. అభ్యర్థుల జీవితాలను మార్చేసింది. అదే టెక్నాలజీ ద్వారా డబ్బు పంపిణీ..

అవును.. ఇప్పుడు బయట పోలీసుల నిఘా.. వార్డులు, డివిజన్ల ప్రత్యర్థుల నిఘా వెరిసి మున్సిపాలిటీల్లో పోటీచేసే అభ్యర్థులంతా ఇప్పుడు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం ద్వారా ఓటర్ల కు డబ్బులు పంచుతూ ఓట్లను కొనేస్తున్నారు.

చాలా మంది మున్సిపల్ అభ్యర్థులు ఎక్కడా దొరకని ఈ విధానంతో పే యాప్ ల ద్వారా డబ్బులను నేరుగా ఓటర్ల ఖాతాల్లోకి బదిలీ చేస్తూ తమకే ఓటు వేయాలని ప్రలోభాలకు గురిచేస్తున్నారు.

ఇక హైదరాబాద్ శివారు మున్సిపాలిటీల్లో అయితే కోట్లు కుమ్మరిస్తున్నారు. శంషాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఒక్కో ఓటుకు రూ.5వేల నుంచి రూ.15వేల వరకూ పంచారు. కొన్ని వార్డుల్లో ఓట్లను బల్క్ గా కొనేందుకు లక్షల రూపాయలను ఓటర్లపై వెదజల్లుతున్నారు. కొందరైతే తమకు ఓట్లు వేస్తే మీకు 50 గజాల ప్లాట్లు ఇస్తామని కూడా చెబుతుండడం విశేషం. హైదరాబాద్ శివారులో ఖరీదైన భూములు, రియల్ ఎస్టేట్ ఉండడంతో చైర్మన్ స్థానం కోసం ఏకంగా 10 కోట్లు పెట్టేందుకైనా అభ్యర్థులు వెనుకాడడం లేదట..

ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో అయితే ఓటుకు ఏకంగా 30వేల వరకూ డిమాండ్ పలకడం చూసి అంతా ముక్కున వేలేసుకున్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఓ వార్డులో రెండు రోజుల కిందట ఓటుకు 10వేలు ఓ అభ్యర్థి పంచాడు. మరో అభ్యర్థి 15వేలకు ఒక్కో ఓటు చొప్పున పంచాడు. చైర్మన్ స్థానం ఆశిస్తున్న అభ్యర్థి తాజాగా ఓటుకు 30వేల రూపాయాల చొప్పున పంచిన వైనం విస్తుగొలుపుతోంది. చౌటుప్పల్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతుండడంతో ఎంతైనా ఎన్ని కోట్లైనా పెట్టి కొనుగోలు చేయడానికి అభ్యర్థులు రెడీ అయిపోతున్నారు. ఇలా తెలంగాణ ఎన్నికల్లో కోట్లు కుమ్మరిస్తూ ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ల ద్వారా అభ్యర్థులు చెలరేగిపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికలను మించి సాగుతున్న ఈ పోరులో మొత్తానికి ఓటర్ల పంట అయితే పండుతోంది.