Begin typing your search above and press return to search.

ఎలాన్ ను కేటీఆర్ అడిగితే.. ఇన్ని రాష్ట్రాలు పోటీకి వచ్చాయే

By:  Tupaki Desk   |   17 Jan 2022 5:45 AM GMT
ఎలాన్ ను కేటీఆర్ అడిగితే.. ఇన్ని రాష్ట్రాలు పోటీకి వచ్చాయే
X
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన టెస్లా అధినేత ఎలాన్ మాస్క్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తరచూ సోషల్ మీడియాలో దర్శనమిచ్చే ఆయన.. ఏదోఒక విధంగా ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నలుగుతూనే ఉంటారు. ఇదంతా ఒక ఎత్తుఅయితే.. తాజాగా ఎలాన్ మస్క్ చేసిన ఒక ట్వీట్ పెను దుమారంగా మారింది. మాట వరసకు చెప్పారో.. వ్యూహాత్మకంగానే స్పందించారో కానీ.. కేంద్రంలోని మోడీ మాష్టారిని ఇరుకున పెట్టేలా ఒక అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు విజయవంతంగా.

ఇక్కడే రాజకీయ రచ్చ మొదలైంది. అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే.. అప్పుడప్పుడు నెటిజన్లతో కలిసి మాట్లాడుతుంటారు టెస్లా అధినేత. ఈ క్రమంలో ఒక అభిమాని రోటీన్ ప్రశ్ననే సంధించారు. ఇండియాలో ఎల్ట్రక్రిక్ కార్లను ఉత్పత్తి చేస్తే అద్భుతంగా ఉంటుందంటూ ఇటీవల ఓ ట్విట్టర్ యూజర్ కోరగా.. అందుకు స్పందించిన ఎలాన్ మాస్క్.. ‘‘నాకు రావాలనే ఉంది. కానీ.. భారత ప్రభుత్వం నుంచి చాలా కఠినమైన సవాళ్లు ఎదురవుతున్నాయి’ అని పేర్కొనటం తెలిసిందే. ఈ మాటకు మోడీ వ్యతిరేకులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.

ఇటీవల కాలంలో మోడీ సర్కారును ఛేజ్ చేస్తున్న వారిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన కుమారుడు కేటీఆర్ ఏ చిన్న ఛాన్సును వదులుకోకుండా విమర్శల వర్షం కురిపించారు. అలానే పండుగ హడావుడిలో ఉన్నట్లు కనిపించినా.. ఏదైనా అవకాశం లభిస్తే దాన్ని మిస్ చేసుకోకుండా ట్వీట్లను అప్డేట్ చేసే కేటీఆర్ టీం.. ఎలాన్ మాస్క్ ట్వీట్ కు బదులిస్తూ.. తాను తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రీ.. కామర్స్ మంత్రినని..తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టటానికి రావాలని ఆహ్వానించారు.

‘‘నేను తెలంగాణ ఇండస్ట్రీ, కామర్స్ మంత్రిని. టెస్లా మా రాష్ట్రంలో భాగస్వామి అయితే చాలా సంతోషంగా ఉంటుంది. తెలంగాణలో ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల విధానం ఉంది. 200 ఎకరాల్లో ఈవీ పార్క్ సెజ్ ఉంది. ఇటీవల అమెరికా ఈవీ మేజర్ ‘ట్రిటాన్’ రూ. 2,100 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్టు ప్రకటించారు’’ అంటూ తెలంగాణలో కార్ల ఫ్యాక్టరీకి ఉన్న అనుకూల అంశాల్నిఏకరువు పెట్టారు.

మంత్రి కేటీఆర్ ట్వీట్ పుణ్యమేమో కానీ.. మోడీని వ్యతిరేకించే రాష్ట్రాలు.. పోటాపోటీగా ఎలాన్ మాస్క్ ను తమ రాష్ట్రానికి రావాలంటే తమ రాష్ట్రానికి రావాలంటూ ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా ఎలాన్ ట్వీట్ కుస్పందించి.. తమ రాష్ట్రంలో ఉన్న అవకాశాల్ని పేర్కొంటూ.. పంజాబ్.. మహారాష్ట్ర.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు తమ వద్దకు రావాలని. తాము మిగిలిన విషయాల్ని చూసుకుంటామని పేర్కొనటం గమనార్హం. ఇలా ఎవరికి వారు.. తమ రాష్ట్రానికి రావాలని కోరుతూ చేస్తున్న ట్వీట్లకు ఎలాన్ మాస్క్ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.