Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ.. ఉగ్ర గుప్పెట‌లో భాగ్య‌న‌గ‌రి!

By:  Tupaki Desk   |   9 Sept 2017 3:09 PM IST
మ‌ళ్లీ.. ఉగ్ర గుప్పెట‌లో భాగ్య‌న‌గ‌రి!
X
భాగ్యన‌గ‌రం మ‌రోసారి చివురుటాకులా ఒణికిపోయింది. ఇటీవ‌ల కాలంలో ప్రశాంతంగా - శాంతి యుతంగా అడుగులు వేస్తున్న న‌గ‌రంలో మ‌ళ్లీ ఒక్క‌సారిగా పెను కుదుపు చోటు చేసుకుంది. అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాద సంస్థ ఐసిస్‌ మూక‌ల జాడ బ‌ట్ట‌బ‌య‌లైంది. జ‌నాల నెత్తురు రుచి మ‌రిగిన ఉగ్ర వాదుల అల‌జ‌డి హైద‌రాబాద్‌ ను భ‌య‌కంపితురాలిని చేసింది. ప్ర‌శాంత‌త‌ను ప‌ఠాపంచ‌లు చేస్తూ.. ప్ర‌జ‌ల‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. జాతీయ ద‌ర్యాప్తు సంస్థ(ఎన్ ఐఏ) అధికారులు శ‌నివారం ఒక్క‌సారిగా హైద‌రాబాద్‌ లో గాలింపులు - సోదాలు చేశారు.

ఉరుములు లేని వ‌ర్షంలా కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సోదాలు చేప‌ట్ట‌డంతో ఒక్క‌సారిగా స్థానిక అధికారులు అలెర్ట్ అయ్యారు. ఎన్‌ ఐఏ అధికారులు శనివారం ముగ్గురు ఐసిస్‌ ఉగ్రవాదులను అరెస్టుచేశారు. టోలీచౌక్‌ ప్రాంతంలో అబ్దుల్‌ మాలిక్‌ - ఫజులుల్లా - ఖయ్యూం అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఐసిస్‌ ఉగ్రవాద సంస్థతో సంబంధాల విషయమై ఈ ముగ్గురిని ప్రస్తుతం విచారిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌ లో వీరు ప్రధానంగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. లక్నో నుంచి వచ్చిన ఎన్‌ఐఏ అధికారులు స్థానిక పోలీసుల సహకారంతో ఉదయం టోలిచౌక్‌ లోని వీరి నివాసంపై దాడులు చేసి.. రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుకున్నారు.

ఐసిస్‌ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం, వారి కార్యకలాపాలకు సహకరించడం వంటి చర్యలకు వీరు పాల్పడ్డట్టు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. వీరికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కాగా, గ‌తంలోనూ గోకుల్‌ చాట్ త‌దిత‌ర ప్రాంతాల్లో పేలుళ్లు సంభ‌వించిన విష‌యం తెలిసిందే. అయితే, తెలంగాణ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత ఈ దాడుల‌కు ఫుల్ స్టాప్ ప‌డుతుంద‌ని అంద‌రూ భావించారు. నిజానికి గ‌త మూడేళ్లుగా హైద‌రాబాద్ ప్ర‌శాంతంగానే ఉంద‌ని చెప్పొచ్చు. ఒప్పుడు ఒక్క‌సారిగా రేగిన క‌లక‌లం రేగ‌డంతో భాగ్య‌న‌గ‌ర వాసులు ఉలిక్కి ప‌డ్డారు.