Begin typing your search above and press return to search.

ప్రయోగాత్మక పరిశోధనల్లో మంచిఫలితాలిస్తున్న ‘2డీజీ’ !

By:  Tupaki Desk   |   23 May 2021 2:30 AM GMT
ప్రయోగాత్మక పరిశోధనల్లో మంచిఫలితాలిస్తున్న ‘2డీజీ’ !
X
దేశంలో కరోనా వైరస్ విజృంభణ పెరుగుతోన్న నేపథ్యంలో ప్రభుత్వం వ్యాక్సిన్ల పై ప్రత్యేక దృష్టి పెట్టింది. వీలైనకాడికి వ్యాక్సినేషన్ చేస్తూ 'కరోనావైరస్' ను అంతం చేయాలనే లక్ష్యంతో అడుగులు ముందుకి వేస్తోంది. అందుకే పలు రకాల వ్యాక్సిన్లకి కూడా ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. ఇదిలా ఉంటే .. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యం లో, డీఆర్‌ డీవో, హైదరాబాద్‌ కు చెందిన డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ సంయుక్తంగా ‘2-డియోక్సీ-డి-గ్లూకోజ్‌' గ్లూకోజ్‌ (2డీజీ)' పేరుతో కరోనా నివారణకు మందును రూపొందించిన సంగతి తెలిసిందే.

దేశవ్యాప్తంగా 30కి పైగా ప్రభుత్వ ఆసుపత్రులలో 3వ విడతగా ఈ మందును ప్రయోగాత్మకంగా వినియోగించగా, వాటిలో చెంగల్పట్టు ప్రభుత్వ వైద్యకళా శాల ఆస్పత్రి ఒకటి. చెంగల్పట్టు ప్రభుత్వాస్పత్రిలో ‘2డీజీ' మందు ప్రయోగాత్మక వినియోగం సత్ఫలితా లనిస్తోందని ఆస్పత్రి నిర్వాహకులు తెలిపారు. ఆస్పత్రి కార్డియాలజిస్ట్‌ వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ... ‘2డీజీ' మందు అలోపతి వైద్య విధానంలో తయారైందని, తమ ఆస్పత్రిలో రెండు దశల్లో 18 నుంచి 65 ఏళ్ల వయస్సున్న 20 మంది బాధితులపై ప్రయోగించామన్నారు. మొదటగా బాధితులకు మందుపై అవగాహన, వారి సందేహాలు నివృత్తి చేశాక, వారి అనుమతితో పరిశోధనలు చేపట్టామని తెలిపారు. తొలి దశలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని బాధితులకు నీటిలో కలిపిన మందును అందజేశామని, బాధితులు 4 నుంచి 5 రోజుల్లో కరోనా వైరస్‌ నుంచి కోలుకొని నెగటివ్‌ వచ్చిందన్నారు. బాధితుడి బరువును బట్టి ఎంత మందు ఇవ్వాలో నిర్ణయించామని, ఈ మందు సత్ఫలితాలు ఇచ్చిందన్నారు. ప్రస్తుతం వినియోగిస్తున్న మందుల కన్నా '2డీజీ' మందుతో ఆక్సిజన్‌ అవసరాలు తగ్గుతాయని అన్నారు.

ఇక దేశంలో భారత్‌లో రెండవ విడత కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. వరుసగా 6వ రోజు రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షలకు దిగువన నమోదైంది. పాజిటివ్ కేసులు తగ్గినా.... కరోనా మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది.గడచిన 24 గంటలలో 2,57,299 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడచిన 24 గంటలలో దేశంలో కరోనాతో మొత్తం 4194 మంది మృతిచెందారు. దేశంలో నమోదైన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 11.63 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదైన కేసులలో మరణాల రేటు 1.12 శాతంగా ఉంది.