Begin typing your search above and press return to search.

మహారాష్ట్రలో మరో దారుణం: బ్లాక్ మెయిల్ చేసి బాలికపై 29మంది గ్యాంగ్ రేప్

By:  Tupaki Desk   |   23 Sep 2021 3:30 PM GMT
మహారాష్ట్రలో మరో దారుణం: బ్లాక్ మెయిల్ చేసి  బాలికపై 29మంది గ్యాంగ్ రేప్
X
మహారాష్ట్రలో మరో దారుణం వెలుగుచూసింది. ముంబై నిర్భయ ఘటన కంటే ఘోర ఘటనగా చెప్పొచ్చు. ఠాణే జిల్లాలో ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 15 ఏళ్ల బాలికపై గత కొన్ని నెలలుగా 29 మంది మృగాళ్లు అత్యాచారానికి పాల్పడ్డ పాశవిక ఘటన వెలుగుచూసింది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగుచూసింది. ఈ గ్యాంగ్ రేప్ చేసిన వారిలో ఇద్దరు మైనర్ బాలురు కూడా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. వారంతా ఆమెను బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి ఈ అత్యాచారాలకు పాల్పడినట్లు బాలిక తన ఫిర్యాదులో పేర్కొంది.

ఠాణే జిల్లాలోని దోంబివల్లిలోని భోపర్ జరిగిన అత్యంత దారుణ ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 15 ఏళ్ల బాలికపై 29మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో పలుసార్లు మైనర్ బాలికపై 29 మంది అత్యాచారానికి పాల్పడ్డారు.

దోంబివల్లిలోని మన్పాడా పోలీసుల కథనం ప్రకారం.. 15 ఏళ్ల బాలికకు ఓ యువకుడితో పరిచయం ఉంది. ఈ ఏడాది జనవరిలో ఓ సందర్భంలో ఆ యువకుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను వీడియోలు తీశాడు. అనంతరం బ్లాక్ మెయిల్ చేశాడు. ఆ వీడియోలను యువకుడు తన మిత్రులు కొంతమందికి పంపాడు. ఈ వీడియోలను అడ్డు పెట్టుకొని ఏకంగా 29మంది బాలికను చిత్రహింసలు పెడుతూ తొమ్మిది నెలల పాటు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

బుధవారం రాత్రి బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. గడిచిన 9 నెలలుగా అనుభవించిన క్షోభ గురించి వివరించింది. లైంగిక దాడిలో మొత్తం 29 మంది పాల్గొన్నట్టు బాధిత బాలిక తెలిపింది. కేసు నమోదు చేసిన వెంటనే ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 23 మంది నిందితులను పట్టుకున్నట్టు తెలిపారు. పోస్కో, గ్యాంగ్ రేప్ కింద వీరిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.