Begin typing your search above and press return to search.

ట్రంప్ తిడుతున్నా అమెరికాపై క్రేజ్ తగ్గలేదా..?

By:  Tupaki Desk   |   9 April 2016 6:38 AM GMT
ట్రంప్ తిడుతున్నా అమెరికాపై క్రేజ్ తగ్గలేదా..?
X
అమెరికాలో పనిచేసేందుకు విదేశీ నిపుణులకు ఇచ్చే హెచ్1 బి వీసాలకు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయట. 65 వేల హెచ్1బీ వీసాలు జారీ చేయడానికి అవకాశం ఉండగా మొత్తం 2.5 లక్షల దరఖాస్తులు వచ్చాయని అమెరికా ఇమిగ్రేషన్ డిపార్టుమెంటు చెప్పింది. అమెరికా జీవనంపై భారతీయుల ఆశలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడానికి ఈ గణాంకాలే ఉదాహరణ. అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారత ఐటీ సంస్థలు భారత్ నుంచి నిపుణులను రప్పించుకోవడానికి, భారత్‌ లో క్యాంపస్‌ లు నెలకొల్పే బహుళజాతి సంస్థలు అక్కడి తమ సిబ్బందిని అమెరికాలోని ఆఫీసులకు తీసుకువచ్చేందుకు ప్రధానంగా ఈ వీసాల కోసం దరఖాస్తు చేస్తుంటాయన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదికి 65 వేల హెచ్1బీ వీసాలను మంజూరు చేయాలని అమెరికా నిర్ణయించగా, ఇప్పటివరకు 2.5 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు ఇమిగ్రేషన్ విభాగం వెల్లడించింది.

ఇక అమెరికాలోనే ఉన్నత విద్య చదువుకున్నవారికి ఇచ్చే 20,000 హెచ్1బీల కోసం అంతకు రెండింతలమంది దరఖాస్తు చేసుకున్నారట. వీటిలో పూర్తి అర్హతలు ఉన్న దరఖాస్తులు పరిశీలించి వాటిని ఫిల్టరు చేసి ఆ తరువాత డ్రా ఆధారంగా వీసాలు మంజూరు చేస్తారు. కాగా... అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరులో రేసులో ముందు నిలుస్తున్న ట్రంప్ భారత విద్యార్థులపై - భారత ఉద్యోగులపై పలుమార్లు అక్కసు వెల్లగక్కిన సంగతి తెలిసిందే. అయినా... అక్కడ మున్ముందు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అన్న ఆందోళనేమీ లేకుండా అమెరికా తరలిపోవడానికి భారతీయ నిపుణులు ఆసక్తి చూపుతుండడం ఆశ్చర్యకరమే.