Begin typing your search above and press return to search.

ఏపీలో బీజేపీకి 25 శాతం ఓట్లు? కంగారు పడకండి.. వీర్రాజు లెక్క ఇది

By:  Tupaki Desk   |   22 Aug 2020 1:00 PM IST
ఏపీలో బీజేపీకి 25 శాతం ఓట్లు? కంగారు పడకండి.. వీర్రాజు లెక్క ఇది
X
అంకెలు మహా సిత్రమైనవి. వాడుకున్నోడికి వాడుకున్నంత అన్నట్లుగా ఉంటాయి. అంకెల్ని ఆధారంగా చేసుకొని ఎలా కావాలంటే అలా తిప్పేసే సత్తా ఉంటే.. ఎలా ఉంటుందో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పోము వీర్రాజు తాజాగా తన మాటలతో చెప్పేశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి తిరుగులేదని చెబుతున్న ఆయన.. తాజాగా 2024 ఎన్నికల్లో బీజేపీకి ఏపీలో 25 శాతం ఓట్లు వచ్చేస్తాయన్న లెక్క చెప్పేస్తున్నారు. అదెలానంటే.. దానికి భారీ లెక్కల్ని బయటకు తీశారు.

ఒకసారి ఒంటరిగా.. మరోసారి ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకునే అలవాటున్న బీజేపీ.. 2019 ఎన్నికల్లో ఒంటరిగా దిగి.. దారుణంగా దెబ్బ తిన్న వైనం తెలిసిందే. ఇటీవల రాష్ట్ర పార్టీ పగ్గాల్ని సోముకు కట్టబెట్టటం తెలిసిందే. వచ్చే ఎన్నికలనాటికి పార్టీకి 25 శాతం ఓట్లను తీసుకురావటమే తన లక్ష్యమన్నట్లుగా చెబుతున్నారు. ఇంతకీ.. పాతిక శాతం ఓట్లు ఎలా సోము? అంటే.. ఆయన కాస్త భిన్నమైన వాదనను వినిపిస్తున్నారు.

2009 ఎన్నికల బరిలో నిలిచిన ప్రజారాజ్యం పార్టీకి 18 శాతం ఓట్లు లభించాయి. 1998లో వాజ్ పేయ్ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లిన సమయంలోనూ కమలనాథులు 18 శాతం ఓట్లను సొంతం చేసుకున్నారు. అప్పట్లో నాలుగు ఎంపీ సీట్లను గెలుచుకున్నారు కూడా. పవన్ కల్యాణ్ పార్టీ జనసేన 7 శాతం ఓట్లను సొంతం చేసుకుంది. ఇదంతా చూస్తే.. అధికార.. విపక్షాలకు కాకుండా మధ్యేమార్గంగా ఉండే పార్టీలకు దక్కే ఓట్లు 18 శాతంగా ఉన్నట్లుగా తేలుతుందని.. వారి ఓట్లను సొంతం చేసుకుంటే తాము అనుకున్నది సాధిస్తామని చెబుతున్నారు.

ఎక్కడైనా.. ఏ పార్టీ అయినా తమదైన ఓటు బ్యాంకును తయారు చేసుకోవాలని భావిస్తుందే తప్పించి.. మధ్యేమార్గంగా ఉండే వారి ఓట్ల శాతాన్ని లెక్కించి.. వాటితొ బలమైన రాజకీయ శక్తిగా మారతామన్న వీర్రాజు ఆలోచన ఎంతమేర వర్క్ వుట్ అవుతుందని.. రానున్న రోజుల్లో జరిగే ఎన్నికలు స్పష్టం చేస్తాయని చెప్పక తప్పదు. ఎప్పుడైనా న్యూట్రల్ ఓటర్లు కొద్దిమంది ఉంటారు. వారు ఎప్పుడు.. ఎటు వైపు వెళతారో? అంచనా వేయటం అంత ఈజీ కాదు. అలాంటి వారితో ఏపీలో అద్భుతాలు సాధిస్తామన్నట్లుగా సోము చెబుతున్న మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.