Begin typing your search above and press return to search.

మ‌న కాలుష్యం..ఎయిడ్స్ కంటే ఘోరమ‌ట‌

By:  Tupaki Desk   |   20 Oct 2017 10:16 AM GMT
మ‌న కాలుష్యం..ఎయిడ్స్ కంటే ఘోరమ‌ట‌
X
మ‌న‌దేశానికి సంబంధించి మ‌రో సంచ‌ల‌నమైన‌...ఇంకా చెప్పాలంటే విస్మ‌య‌క‌ర‌మైన విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన వ్యాధుల కంటే కూడా...పర్యావ‌ర‌ణ స‌మ‌తూల్య‌త దెబ్బ‌తిన‌డం వ‌ల్ల క‌లిగే కాలుష్యం అత్యంత ప్ర‌మాద‌క‌రంగా మారింద‌ని తేలింది. ఇండియాలో కాలుష్యం పెరిగిపోతోంద‌ని తాజాగా ఓ స‌ర్వే వెల్ల‌డించింది. ఒక్క 2015లోనే కాలుష్య సంబంధిత రోగాల కారణంగా ఇండియాలో 25 లక్షల మంది మృత్యువాత పడ్డారు. ఈ విషయంలో ప్రపంచంలోనే ఇండియా తొలి స్థానంలో ఉంది. తాజాగా జరిగిన ఓ అంతర్జాతీయ స్థాయి అధ్యయనం ఈ చేదు నిజాన్ని వెల్లడించింది.

ద లాన్సెట్ అనే సంస్థ నిర్వహించిన అధ్య‌య‌నంలో ఎయిడ్స్ - టీబీ - మలేరియా రోగాల వల్ల చనిపోయిన వారి కంటే కాలుష్యం బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 2015లో మూడు రెట్లు ఎక్కువగా ఉంద‌ని తేలింది. అందులోనూ వాయు కాలుష్యం వల్లే 18 లక్షల మంది చనిపోయారు. ఇందులోనూ మ‌న‌దేశం ప్ర‌థ‌మ స్థానంలో ఉండ‌టం గ‌మ‌నార్హం. అదే ఏడాది నీటి కాలుష్యం వల్ల మరో 6.4 లక్షల మంది చనిపోయినట్లు ఈ నివేదిక వెల్లడించింది. ఇందులో 70 శాతం మరణాలు - గుండె సంబంధిత - శ్వాసకోశ వ్యాధుల వల్లేనని ఈ అధ్యయనం తేల్చింది. ప్రతి దేశంలోనూ కాలుష్యం బారిన పడి ఎక్కువగా చనిపోతున్నది బలహీన వర్గాలే. ప్రపంచంలో వాయు కాలుష్యం వల్ల చనిపోయిన వారిలో 50 శాతానికిపైగా ఇండియా - చైనా వాళ్లేనని ఈ అధ్యయనం తేల్చిచెప్పింది.

మ‌రోవైపు కాలుష్యం వల్ల రోగాలు పెరిగి మెడికల్ ఖర్చులు కూడా తడిసి మోపెడవుతున్నాయి. ప్రపంచంలోని పది మంచి పేరున్న దేశాలను చూస్తే కాలుష్యం కారణంగా ఎక్కువగా చనిపోతున్న వారు ఇండియా - బంగ్లాదేశ్‌ లలోనే ఎక్కువగా ఉన్నారు. అంతేకాదు మరింత ఆందోళన కలిగించే విషయం ఏంటంటే.. రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కాలుష్య మరణాలు 50 శాతం వరకు పెరిగే ప్రమాదం ఉందని కూడా ఈ స్టడీ తేల్చింది. అంటే 2050లో ఈ మరణాలు 42 లక్షల నుంచి 66 లక్షలకు చేరే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఇండియా ఉన్న దక్షిణాసియా - తూర్పు ఆసియా నగరాల్లో కాలుష్యం వేగంగా పెరగనుందని అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య 16 శాతం పెరగగా.. అందులో ఇండియాలాంటి తక్కువ - మధ్య ఆదాయ దేశాల్లోనే 92 శాతం మరణాలు నమోదయ్యాయ‌ని లాన్సెట్ స‌ర్వే వివ‌రించింది.