విషాదం : ఆక్సిజన్ అందక 24 మంది మృతి !

Mon May 03 2021 14:08:02 GMT+0530 (IST)

24 people died due to oxygen deprivation

దేశంలో కరోనా సెకండ్ వేవ్  ఉధృతి కొనసాగుతోంది. ప్రపంచంలోనే ఎన్నడూ ఎక్కడా లేని విధంగా గత కొన్ని రోజులుగా మూడు లక్షల కేసులు నమోదు అవుతున్నాయి. కేసుల సంఖ్య పెరిగే కొద్దీ ఆక్సిజన్ బెడ్స్ మందుల కొరత తీవ్రమౌతోంది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ లో కరోనా బాధితులు ఆక్సిజన్ అందక మరణించే సంఖ్య పెరిగిపోయింది. కర్ణాటక లో పరిస్థితి మరీ ఘోరంగా మారిపోయింది. ఆక్సిజన్ అందక కర్ణాటక వాసులు ప్రాణాలు గాలిలో కల్సిపోతున్నాయి.తాజాగా 24 గంటల్లో కర్ణాటకలోని ప్రభుత్వ దవాఖానలో 24 మంది రోగులు మరణించారు. చామరాజనగర్ జిల్లా హాస్పిటల్ లో రోగులు ఆక్సిజన్ కొరత ఇతర కారణాలతో మృత్యువాతపడ్డారు. అయితే సరైన సమయంలో ఆక్సిజన్ అందక చనిపోయారు అని ఆరోపణలు చేస్తుంటే హాస్పిటల్ మాత్రం ఆస్పత్రిలో ఆక్సిజన్ సరిపడా ఉంది అని పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వస్తే వారి మరణాలకు సరైన సమాధానం లభిస్తుంది అని అన్నారు. చనిపోయిన పేషెంట్లు మొత్తం వెంటిలేటర్లపై ఉన్నవారని.. వారికి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని చామరాజనగర్ డిప్యూటీ కమిషనర్ ఎం.ఆర్.రవి వెల్లడించారు. వీరు ఆక్సిజన్ కొరతతోనే మరణించారని చెప్పలేమన్నారు.

 ఇక  ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు జిల్లా ఇన్‌చార్జి మంత్రి సురేష్ కుమార్ తెలిపారు. మరణాలపై నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామన్నారు. సంఘటనపై సీఎం యెడియూరప్ప విచారం వ్యక్తం చేశారు. అలాగే కలెక్టర్‌తో మాట్లాడారు. ఈ క్రమంలో మంగళవారం అత్యవసర కేబినెట్ సమాశానికి పిలుపునిచ్చారు. ఇకపోతే దేశ రాజధాని దిల్లీలో ఆక్సిజన్ కొరత విపరీతంగా ఉంటున్న విషయం తెలిసిందే. అక్కడ ప్రముఖ ఆసుపత్రుల్లో ప్రాణవాయువు సరఫరా నిలిచిపోవడంతో ఇటీవల పదుల సంఖ్యలో కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు.