Begin typing your search above and press return to search.

22 మంది ప్రాణాలు తీసిన ముంబ‌యి వాన‌లు

By:  Tupaki Desk   |   2 July 2019 5:46 AM GMT
22 మంది ప్రాణాలు తీసిన ముంబ‌యి వాన‌లు
X
దేశ ఆర్థిక రాజ‌ధాని వాన‌లో విల‌విల‌లాడిపోతుంటే.. దానికి సంబంధించిన వార్త‌లు మ‌న దిన‌ప‌త్రిక‌ల్లో కానీ.. టీవీ ఛాన‌ళ్ల‌లో కానీ పెద్ద‌గా క‌నిపించ‌ని ప‌రిస్థితి. గురువారం నుంచి విడిచి పెట్ట‌కుండా కురుస్తున్న వాన‌ల కార‌ణంగా ముంబ‌యిలోని జ‌న‌జీవనం స్తంభించిపోయింది. ముంబ‌యి మ‌హాన‌గ‌రంలోని లోత‌ట్టుప్రాంతాలు త‌టాకాలు మాదిరి మారిపోయాయి. స‌గ‌టు జీవి బ‌తుకు చిత్రం చిన్నాభిన్న‌మైంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ పాడు వాన‌ల కార‌ణంగా వేర్వేరుప్రాంతాల్లో చోటుచేసుకున్న సంఘ‌ట‌న‌ల కార‌ణంగా ఏకంగా 22 మందికి పైనే మ‌ర‌ణించారు. పెద్ద పెద్ద తుఫానుల సంద‌ర్భంలోనే ఇంత భారీగా మృత్యువాత ప‌డింది లేదు. అందుకు భిన్నంగా నాన్ స్టాప్ గా కురుస్తున్న వాన కార‌ణంగా పెద్ద ఎత్తున మ‌ర‌ణాలు చోటు చేసుకోవ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

భారీ వ‌ర్షాల కార‌ణంగా ముంబ‌యి మ‌హాన‌గ‌రంలోని అనేక చోట్ల గోడ‌లు.. పాడుబ‌డ్డ భ‌వ‌నాలు కూలిపోతున్నాయి. ప్రాణాలు పోయే ఉదంతాల‌తో పాటు.. పెద్ద ఎత్తున గాయాలు అయ్యే వారి సంఖ్య ఎక్కువ అవుతోంది. వ‌ర్షాల తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌టంతో ఇప్ప‌టికే ప‌లు రైళ్ల‌ను ర‌ద్దు చేశారు. విమాన స‌ర్వీసులు నిలిచాయి. ముంబ‌యికి రావాల్సిన ప‌లు విమానాల్ని దారి మ‌ళ్లించారు.

మంబ‌యి న‌గ‌రంలోని మ‌లాడ్ ఈస్ట్ ప్రాంతంలో పింప‌రీపాడ ప్రాంతంలో గోడ కూలిన ఘ‌ట‌న‌లో ఏకంగా 13 మంది మృత్యువాత ప‌డ్డారు. మ‌రో 13 మంది గాయ‌ప‌డ్డారు. ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు స్పందించి.. అక్క‌డ‌కు చేరుకునే లోపే స్థానికులు రియాక్ట్ అయి శిధిలాల్లో కూరుకుపోయిన వారిని ర‌క్షించటంతో పలువురికి ప్రాణాపాయం త‌ప్పింది. విడ‌వ‌కుండా కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా స్కూళ్ల‌కు సెల‌వులు ప్ర‌కటించారు. లోత‌ట్టు ప్రాంతాల్లో నివాసాలు ఉన్న వారు తీవ్ర ఇబ్బందుల‌కు గురి అవుతున్నారు.