Begin typing your search above and press return to search.

కుప్పకూలిన మిలటరీ విమానం..22 మంది దుర్మరణం

By:  Tupaki Desk   |   26 Sept 2020 11:15 AM IST
కుప్పకూలిన మిలటరీ విమానం..22 మంది దుర్మరణం
X
ఉక్రెయిన్ లో తీవ్ర విషాదకర సంఘటన జరిగింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 8.50 నిమిషాల సమయంలో ఉక్రెయిన్ వైమానిక దళానికి చెందిన మిలిటరీ విమానం కుప్పకూలడంతో 22 మంది దుర్మరణం పాలయ్యారు. ఖర్కీవ్ అనే ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. విమానం లో మొత్తం 28 మంది ఉన్నారని.. ప్రమాదంలో 22 మంది మృతి చెందినట్లు ఆ దేశ రక్షణ శాఖ డిప్యూటీ మంత్రి అంటన్ గెరాశ్చెంకా తెలిపారు. ఆ విమానంలో మొత్తం 28 మంది ఉన్నారని, ఇద్దరు గాయపడగా.. మరో ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉందని ఆయన తెలిపారు. విమానంలో ఉన్నవారిలో 21 మంది శిక్షణ పొందుతున్న సైనికులు ఉన్నారు. మిగతా ఏడుగురు క్రూ సిబ్బంది ఉన్నారు. విమానం ప్రమాదానికి కురవడానికి గల కారణాలను ఇప్పుడే చెప్పలేమని మంత్రి తెలిపారు.

ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమియర్ జెలెన్ స్కీ ప్రమాదంపై ఫేస్ బుక్ ద్వారా స్పందిస్తూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలను తెలుసుకునేందు కోసం తక్షణ విచారణకు కమిషన్ను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో శనివారం అధ్యక్షుడు పర్యటించాల్సి ఉంది. ఉక్రెయిన్ మిలట్రీ దళానికి చెందిన అంటోనోవ్-26 విమానం చూహయివ్ ఆర్మీ క్యాంపు కు రెండు కిలోమీటర్ల దూరంలోనే ఈ దుర్ఘటన జరిగింది. విమానం కూలగానే భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. అయితే ఈ దుర్ఘటన రష్యా అనుకూల వేర్పాటు వాదులు ఉండే ప్రాంతానికి 100 కిలోమీటర్ల దూరంలోనే ఉండడం తో.. వారికి ఈ ప్రమాదానికి ఏమైనా సంబంధం ఉందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంజన్ ఫెయిల్ అవడం వల్లే విమానం ఒక్కసారిగా కుప్పకూలి ఉంటుందని కొందరు చెబుతున్నారు. ప్రమాదంలో 30 ఏళ్ల ఎయిర్ క్రాఫ్ట్ కమాండర్ కూడా ప్రాణాలు విడిచాడు.