Begin typing your search above and press return to search.

మొదలైన తాలిబన్ల ఊచకోత

By:  Tupaki Desk   |   14 July 2021 4:57 AM GMT
మొదలైన తాలిబన్ల ఊచకోత
X
యావత్ ప్రపంచం అనుమానిస్తున్నట్లుగానే ఆప్ఘనిస్ధాన్ లో తాలిబాన్ల ఊచకోత మొదలైపోయింది. 22 మంది మిలిట్రీ కమేండోలను వరుసగా నిలబెట్టి కాల్చిపారేశారు. ఎదురు కాల్పులకు సంబంధించిన ఘటనలో కమేండోలు లొంగిపోయినా తర్వాత కూడా తాలిబన్లు వాళ్ళని వదిలిపెట్టకుండా కాల్చి చంపటం గమనార్హం. తాము లొంగిపోతున్నామని, కాల్చవద్దని కమేండోలు వేడుకున్నా తాలిబన్లు వినిపించుకోలేదు. నిరాయుధులుగా ఉన్న వారందరినీ ఒకచోట వరసుగా నిలబెట్టి కాల్చిచంపేశారు.

ఆప్ఘన్ నుండి నాటో దళాలు, ముఖ్యంగా అమెరికా సైన్యం వెళిపోతే దేశంలో అరాచకం ప్రబలిపోతుందని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తంచేశాయి. ఎందుకంటే ఆప్ఘన్లో తాలిబన్ల ప్రభావం ఆస్ధాయిలో ఉంటుంది కాబట్టి. దేశపు చట్టాలు లేవు, నియమ, నిబంధనలు లేవు, పోలీసులు, మిలిటీరీ, కోర్టులు ఏవీ ఉండవు. అక్కడ అమల్లో ఉండేదంతా తాలిబన్ల చట్టం మాత్రమే. తమను ఎదరించినా, వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు అనుమానం వచ్చిన సరే వెంటనే ఎలాంటి విచారణలు లేకుండానే చంపేస్తారు.

తాలిబన్ల చేతిలో దాదాపు నాశనమైపోయిన ఆప్ఘనిస్ధాన్ను అమెరికా నేతృత్వంలోని నాటో దళాలు తమ చేతిలోకి తీసుకున్నాయి. దాదాపు దశాబ్దంపాటు తాలిబన్ల చేతిలో సర్వ నాశనమైపోయిన దేశం కాస్త గాడిలో పడటానికి చాలా సంవత్సరాలే పట్టింది. అలాంటిది ఇపుడు మళ్ళీ తాలిబన్ల చేతిలోకి దేశం వెళిపోయింది. ఎప్పుడైతే దేశం తమ చేతిలోకి వచ్చిందో వెంటనే తమదైన పాలనను రుచిచూపించటం మొదలుపెట్టారు తాలిబన్లు.

ఓ భవనం దగ్గర నుండి 22 మంది కమేండోల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు ప్రకటించారు. స్ధానిక ప్రజలు కూడా కమేండోలను కాల్చి చంపటం చూశారట. అయితే తాలిబన్లు మాత్రమే తాము కమేండోలను కాల్చి చంపలేదంటున్నారు. వాళ్ళంతా బందీలుగా తమ దగ్గరే ఉన్నట్లు నమ్మబలుకుతున్నారు. అయితే బందీలున్నట్లుగా ఆధారాలేమీ చూపలేదు. మొత్తానికి తాలిబన్ల అరాచకాలైతే మొదలైనట్లే అనిపిస్తోంది.