సుప్రీంలో 21 పార్టీల రివ్యూ పిటిషన్..విషయం ఏమంటే?

Wed Apr 24 2019 18:20:16 GMT+0530 (IST)

21 opposition parties file review petition in SC for 50% verification of VVPats

గడిచిన కొద్ది రోజులుగా వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై ఆందోళనలు వ్యక్తం చేస్తున్నరాజకీయపార్టీలు తాజాగా సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ ను దాఖలు చేశాయి. దేశ వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నరాజకీయపార్టీలు గతంలోనూ సుప్రీంను ఆశ్రయించి..వీవీ ప్యాట్లలో నమోదైన స్లిప్పుల్లో 50 శాతం లెక్కించాలని కోరాయి.దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం.. ఎన్నికల కమిషన్ ను అడగటం.. అది సాధ్యమయ్యే పని కాదని తేల్చటంతో  వయా మీడియాగా ప్రతి నియోజకవర్గ పరిధిలో 5 ఈవీఎంలలో వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలన్న ఆదేశాల్ని జారీ చేసింది. సుప్రీం నిర్ణయంపై సంతృప్తి వ్యక్తం చేయని రాజకీయ పార్టీలు తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టును మరోసారి ఆశ్రయించాయి.

వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించే విషయంపై మరోసారి విచారణ చేపట్టాలని.. 50 శాతం స్లిప్పులు లెక్కించేలా ఈసీకి ఆదేశాలు ఇవ్వాలంటూ 21 రాజకీయ పార్టీలు తమ తాజా పిటిషన్ లో కోరాయి. వీవీ ప్యాట్ లలోని 50 శాతం స్లిప్పులను లెక్కించటం మొదలు పెడితే ఓట్ల లెక్కింపు కార్యక్రమం రోజుల తరబడి సాగుతుందన్న అభ్యంతరాలు ఉన్నాయి. అయితే.. సరైన రీతిలో వనరుల్ని ఉపయోగించటం.. సిబ్బంది..సాంకేతికతను ఉపయోగిస్తే యాభై శాతం స్లిప్పులను లెక్కించటం పెద్ద కష్టమైన పని కాదన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ లో 21 రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. ‘ 50% స్లిప్పులు లెక్కిస్తే.. ఎన్నికల సంఘం మీద ఈవీఎంల మీద ప్రజలకు మరింత విశ్వాసం పెరుగుతుంది. ఫలితాల్లో సైతం కచ్చితత్వం కనిపిస్తుంది. అంతేగానీ ఎవర్నీ నిందించడానికో.. అవమానించటానికో మేం డిమాండ్ చేయటం లేదు అని పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనం కోసమే యాభై శాతం స్లిప్పులను లెక్కించాలని తాము పట్టుబడుతున్నట్లుగా పేర్కొన్నారు. మరి.. దీనిపై సుప్రీం ఎలా రియాక్ట్ అవుతందో చూడాలి.