Begin typing your search above and press return to search.

రాష్ట్రంలో 'ముందస్తు' ఫీవర్ మొదలైందా ?

By:  Tupaki Desk   |   2 Jan 2022 5:31 AM GMT
రాష్ట్రంలో ముందస్తు ఫీవర్ మొదలైందా ?
X
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల పీవర్ మొదలైపోయినట్లే ఉంది. పార్టీ ఆఫీసులో చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడుతు ముందస్తు ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామంటు ప్రకటించారు. ఆమధ్య జగన్మోహన్ రెడ్డి మంత్రులతో మాట్లాడుతు ముందస్తు సంకేతాలను పరోక్షంగా ఇచ్చారు. దీనికి అదనంగా ప్రధానమంత్రి జమిలి ఎన్నికల గురించి చాలా రోజులుగా చెబుతునే ఉన్నారు. దీంతో షెడ్యూల్ ప్రకారం 2024లో కాకుండా ముందస్తు ఎన్నికలు జరగటం ఖాయమని జనాల్లో చర్చ మొదలైపోయింది.

జరుగుతున్న చర్చ ప్రకారమైతే 2023లోనే ఎన్నికలు జరుగేందుకు అవకాశం ఉంది. చంద్రబాబు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణాలో షెడ్యూల్ ఎన్నికలు 2023లోనే జరగాలి. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన కారణంగా 2023లో షెడ్యూల్ ఎన్నికలు జరగాలి. కాబట్టి తెలంగాణాతో పాటు ఏపీలో కూడా ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారాన్ని చంద్రబాబు గుర్తుచేశారు.

ముందస్తుకు సిద్దమని ప్రకటించారు బాగానే ఉంది. కానీ నిజంగానే ముందస్తుకు రెడీగా ఉన్నారా ? 175 నియోజకవర్గాల్లో కనీసం 100 నియోజకవర్గాల్లో పార్టీకి ఇన్చార్జీలు మార్చాల్సుంటుంది. ఎందుకంటే వీటిల్లో చాలా వాటికి ఇన్చార్జీలు లేరు. ఉన్న వాళ్ళు కూడా యాక్టివ్ గా లేరు. మిగిలిన జిల్లాలు, నియోజకవర్గాలను వదిలేసినా సొంత జిల్లా చిత్తూరులోనే నాలుగు నియోజకవర్గాలకు ఇన్చార్జీలు లేరు. రెండున్నర సంవత్సరాలుగా చిత్తూరు, సత్యవేడు, చంద్రగిరి, తంబళ్ళపల్లికి ఇన్చార్జీలు లేరంటే ఆశ్చర్యంగా ఉంటుంది.

ఇవి కాకుండా మరో ఐదు నియోజకవర్గాల్లో కొత్తవారికి బాధ్యతలు అప్పగించాలని క్యాడర్ మొత్తుకుంటున్నా చంద్రబాబు పట్టించుకోవటంలేదు. ఇలాంటి నియోజకవర్గాలు దాదాపు 100 ఉన్నాయి. ఇన్చార్జీలను కూడా నియమించుకోలేని స్థితిలో తాము ముందస్తుకు రెడీ అంటే ఎవరైనా నమ్ముతారా ? ముందు పార్టీని చక్కబెట్టుకునే విషయంలో చంద్రబాబు దృష్టి పెడితే తర్వాత ముందస్తు గురించి ఆలోచించవచ్చు. పార్టీ బలోపేతానికి కష్టపడటానికి కార్యకర్తలు రెడీగా ఉన్నారు. కానీ నేతలు సిద్ధంగా లేకపోవడం పార్టీకి మైనస్.

ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా పార్టీకి సంబంధించిన నిర్ణయాలను చంద్రబాబు ధైర్యంగా తీసుకోలేకపోతున్నారు. అవసరమైతే నేతలను మార్చేస్తానని, కోవర్టులను ఏరేస్తానని, త్యగాలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించటమే కానీ ఆచరణలో ఒక్క పని కూడా చేయలేకపోతయారు. అందుకనే చాలామంది నేతలకు చంద్రబాబు అంటే చులకన. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా నేతలపై గట్టిగా చర్యలు తీసుకోలేకపోతే ఇంకెప్పుడు తీసుకుంటారు. కాబట్టి ముందు పార్టీ బలోపేతంపై చంద్రబాబు దృష్టి సారిస్తే అదే పదివేలు.