Begin typing your search above and press return to search.

2022 'పార్లమెంట్' శీతాకాల సమావేశాలు కొత్త భవనాల్లోనే !

By:  Tupaki Desk   |   17 May 2021 2:46 PM IST
2022 పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొత్త భవనాల్లోనే !
X
పార్లమెంట్ కొత్త భవనం నిర్మాణం, సెంట్రల్‌ విస్టా పనులను ఈ కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ తగ్గే వరకు కొద్ది రోజుల పాటు ఆపేయాలని , ఆ ప్రాజెక్ట్ డబ్బుని కరోనా కట్టడికి వాడాలని కాంగ్రెస్‌ సహా విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే , కేంద్ర ప్రభుత్వం మాత్రం అడుగు ముందుకు తప్ప , వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు అని చెప్తుంది. ఈ రెండు ప్రాజెక్టుల పనులని వేగవంతం చేసి, 2022 డిసెంబరులో శీతాకాల సమావేశాలను కొత్త భవనంలోనే నిర్వహించాలనే ఆలోచనలో ఉంది. వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవ కవాతును కూడా పూర్తిగా తయారైన సెంట్రల్‌ విస్టా ప్రాంతంలో జరపాలని కేంద్రం కృత నిశ్చయంతో ఉందని సంబంధిత అధికారులు వెల్లడించారు.

పార్లమెంట్ కొత్త భవనం నిర్మాణం, సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టులకు టెండర్లను కరోనా ఉద్ధృతి కంటే ముందే ఖరారు చేశాం. కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కచ్చితంగా పాటిస్తూ దాదాపు 400 మంది కార్మికులు రెండుచోట్ల పనిచేస్తున్నారు. పెంచిన గడువులోగా మొత్తం ప్రాజెక్టు పనులు పూర్తి కావాల్సి ఉన్నందువల్ల సెంట్రల్‌ విస్టాలో మిగిలిన పనులను తర్వాత చేపడతాం అని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ పనులను నిలిపివేసి, ఆ ఖర్చుతో దేశంలో అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ వేయాలన్న కాంగ్రెస్‌ డిమాండ్‌ సరైనది కాదని మరో అధికారి చెప్పారు. కేంద్ర సచివాలయం, ప్రధాని నివాసం, ఉప రాష్ట్రపతి నివాసం సహా మొత్తం 13 భవనాలకు రూ.17,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. 2026 నాటికి వీటిని పూర్తి చేయాల్సి ఉంది.అయితే కరోనా కట్టడి కోసం ఈ ప్రాజెక్ట్ కంటే ఆరు రెట్లు ఎక్కువ మొత్తాన్ని వెచ్చించినట్టు కేంద్రం చెప్తుంది. దీన్ని బట్టి చూస్తే కేంద్రం మాత్రం పార్లమెంట్ కొత్త భవనం నిర్మాణం, సెంట్రల్‌ విస్టా నిర్మాణాల పై దృఢమైన నిర్ణయం తో ఉందని అర్థమౌతుంది.