2021 కూడా చంక నాకి పోయినట్లేనా?

Mon Apr 19 2021 06:00:01 GMT+0530 (IST)

2021 should also be the same as 2020

మేజిక్ ఫిగర్ లా కనిపించే 2020 వస్తుంటే.. చాలా మంది ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురుచూశారు. వచ్చి రాగానే.. కరోనా మహమ్మారి పేరుతో మొదలైన కలకలం.. ఏడాది మొత్తం సాగింది. లాక్ డౌన్ లో కొంతకాలం.. ఆ తర్వాత మరికొంత కాలం పరిమితుల మధ్య కాలం గడిపేశారు. క్యాలెండర్లో నెలలు కరిగిపోయి.. కొత్త క్యాలెండర్లు వచ్చేశాయి. పాడు 2020 పోతే పోయింది 2021లో అయినా.. జీవితం బాగానే ఉంటుందనుకున్నది నిజం కాదన్న మాట వినిపించినంతనే.. అపశకునపక్షి.. నోట్లో నుంచి మంచి మాటలు రావా? అంటూ మండిపడినోళ్లు ఎంతోమంది.చూస్తుండగానే ఈ ఏడాదిలో నాలుగు నెలలు కాలగర్భంలో కలిసిపోయాయి. మొన్నటివరకు పదుల్లో ఉన్న కేసులు వందల్లోకి.. వేలల్లోకి పెరిగిపోవటమే కాదు.. రానున్న రోజుల్లో కేసుల జోరు మరింత పెరగటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. సెకండ్ వేవ్ కొన్ని రాష్ట్రాలకే పరిమితమన్న మాటలో కూడా నిజం లేదన్నది తేలిపోయింది. ఆ రాష్ట్రం.. ఈ రాష్ట్రం అన్న తేడా లేకుండా.. ఒక్కొక్క రాష్ట్రం కరోనా కోరల్లోకి చిక్కుకుంటోంది.

ఫస్ట్ వేవ్ తో పోలిస్తే.. సెకండ్ వేవ్ లో బాధితుల సంఖ్య భారీగా ఉండటమే కాదు.. గత ఏడాది ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో.. ఇప్పుడు అవే రిపీట్ అవుతున్నాయి. వీటికి తోడు కొత్త సమస్యలు కూడా తెర మీదకు వస్తున్నాయి. గత సంవత్సరం మాదిరే పదో తరగతి పరీక్షలు రద్దు కావటం.. రానున్న రోజుల్లో ఇంటర్ కూడా అదే బాటన పట్టే అవకాశం ఉందంటున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచైనా స్కూళ్లు.. కాలేజీలు నడుస్తాయి.. గతంలో మాదిరి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుందన్న మాటలన్ని ఉత్తవేనని తేలిపోయింది.

నిపుణుల అంచనా ప్రకారం.. ఇప్పటికే పెరుగుతున్న కేసులు.. రానున్న మే.. జూన్ లో మరింత పెరగటం ఖాయమంటున్నారు. జులై చివరకు కేసుల తీవ్రత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందంటున్నారు. అంటే.. ఈ ఏడాది జనవరి.. ఫిబ్రవరి నాటి పరిస్థితులు రావాలంటే.. సెప్టెంబరు.. అక్టోబరు నాటికి తెలుగు రాష్ట్రాల్లో ఉంటుందని చెబుతున్నారు. మరో వైపు మూడో వేవ్ కూడా కాస్త తేడాతో మొదలువుతుందన్న మాట వినిపిస్తోంది.

అదే నిజమైతే.. 2021 మాత్రమే కాదు.. 2022 సగం వరకు మన్ను కొట్టుకుపోవటం ఖాయం. ఇదంతా చదువుతుంటే.. గుండెల్లో రైళ్లు పరిగెట్టటమే కాదు.. మనసంతా దిగులుతో నిండిపోవటం ఖాయం. అయితే.. ఇదంతా అంచనా మాత్రమే.. గుర్రం ఎగరావచ్చన్నట్లుగా.. అంతా బాగుండాలని ఆశిద్దాం. మహమ్మారి కోరల్లో చిక్కుకోకుండా క్షేమంగా బయటపడటమే మనందరి ముందున్న లక్ష్యమన్నది మర్చిపోకూడదు.