Begin typing your search above and press return to search.

2021.. టీడీపీకి అవ‌మాన నామ సంవ‌త్స‌ర‌మే..!

By:  Tupaki Desk   |   1 Jan 2022 2:02 PM IST
2021.. టీడీపీకి అవ‌మాన నామ సంవ‌త్స‌ర‌మే..!
X
ఔను.. ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ.. ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న 2021 అన్ని వైపు ల నుంచి అవ‌మాన భారం మోసేలా చేసింది. ఇటు పార్టీ ప‌రంగా.. అటు అధినేత చంద్ర‌బాబు ప‌రంగా కూడా ఈ ఏడాది ఆశించిన ఫ‌లితం ఇవ్వ‌క‌పోగా.. మ‌రిన్ని స‌మ‌స్య‌లు, స‌వాళ్ల‌ను మిగిల్చింద‌నే చెప్పాలి. ఆది నుంచి కూడా ఈ ఏడాది.. పార్టీకి అనేక ఎదురు దెబ్బ‌లు తినేలా చేసింది.

ఈ ఏడాది తొలి అర్ధ‌భాగంలో ఎన్నిక‌ల వేడి రాజుకుంది. గ్రామ‌ పంచాయ‌తీతోపాటు మునిసిపాలిటీ, కార్పొరేష‌న్, జిల్లా, మండ‌ల ప‌రిష‌త్‌ ఎన్నిక‌లు జ‌రిగాయి. అన్ని పార్టీలు ప్ర‌చారాన్ని హోరెత్తించాయి. మొత్తం మార్చి 2వ తేదీ నుంచి మూడు ద‌శ‌ల్లో జ‌రిగిన ఈ ఎన్నిక‌ల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం సాధించింది.

రాష్ట్ర‌వ్యాప్తంగా 12 మునిసిప‌ల్ కార్పొరేష‌న్లు, 75 మునిసిపాలిటీల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ్గా.. అనంత‌పురం జిల్లాలోని తాడిప‌త్రి మునిసిపాలిటీలో మాత్రమే ప్ర‌తిప‌క్ష టీడీపీ విజ‌యం ద‌క్కించుకుంది. అన్ని కార్పొరేష‌న్ల‌లోనూ అధికార పార్టీ విజ‌య‌దుందుభి మోగించింది. అదేవిధంగా వివిధ కారణాలతో ఎన్నికలు నిర్వహించని స్థానిక సంస్ధలకు న‌వంబ‌రు 15న ఎన్నిక‌లు నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో కృష్ణాజిల్లా కొండ‌ప‌ల్లి మునిసిపాలిటీ తీవ్ర వివాదానికి కార‌ణ‌మైంది.

ఇక్క‌డ అధికార, ప్ర‌తిప‌క్షాల‌కు పూర్తి మెజారిటీ రాక‌పోవ‌డంతో ఎక్స్ అఫిషియో స‌భ్యుడిగా ఉన్న విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ ఓటు కీల‌కంగా మార‌డం.. ఆయ‌న ఓటు చెల్ల‌ద‌ని.. అధికార పార్టీ స‌భ్యులు హైకోర్టుకు వెళ్ల‌డంతో వివాదం చెల‌రేగింది. ఎట్ట‌కేల‌కు కోర్టు జోక్యంతో ఇక్క‌డ చైర్మ‌న్ అభ్య‌ర్థి ఎన్నిక జ‌రిగింది. ఇక్క‌డ ఒక్క‌చోటే టీడీపీకి అనుకూలం కావ‌డం గ‌మ‌నార్హం.

మ‌రోవైపు.. తిరుప‌తి పార్ల‌మెంటు స‌భ్యులు బ‌ల్లి దుర్గాప్ర‌సాద్ ఆక‌స్మిక మ‌ర‌ణంతో ఈ స్థానానికి ఏప్రిల్ 17న ఉప ఎన్నిక జ‌రిగింది. తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున కేంద్ర మాజీ మంత్రి ప‌న‌బాక ల‌క్ష్మి, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున డాక్ట‌ర్ గురుమూర్తి, భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌ర‌ఫున మాజీ ఐఏఎస్ అధికారి క‌త్తి ర‌త్న‌ప్ర‌భ పోటీ చేశారు. హోరాహోరీగా సాగిన త్రిముఖ పోరులో విజ‌యం అధికార పార్టీస‌భ్యుడిని వ‌రించింది.

నిజానికి ఇక్క‌డ టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌చారం చేశారు. అయినా ఫ‌లితం ద‌క్క‌లేదు. అదేవిధంగా క‌డ‌ప జిల్లా బ‌ద్వేల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం శాస‌న స‌భ్యులు వెంక‌ట సుబ్బ‌య్య అనారోగ్యంతో క‌న్నుమూయ‌డంతో ఇక్క‌డ కూడా ఉప ఎన్నిక జ‌రిగింది. అక్టోబ‌రు 30న జ‌రిగిన ఈ ఎన్నిక‌లో వెంక‌ట‌సుబ్బ‌య్య స‌తీమ‌ణి డాక్ట‌ర్ సుధ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున పోటీ చేసి విజయం ద‌క్కించుకున్నారు. భారీ మెజారిటీ న‌మోదు చేశారు. అయితే.. అస‌లు ఇక్క‌డ టీడీపీ పోటీ నుంచి త‌ప్పుకోవ‌డం గ‌మ‌నార్హం.

మ‌రోవైపు.. నవంబ‌రు 19న చోటు చేసుకున్న ప‌రిణామం.. టీడీపీకి శ‌రాఘాతంగా మారింది. ఆ రోజు నిర్వ‌హించిన అసెంబ్లీ స‌మావేశంలో త‌న కుటుంబాన్ని వైసీపీకి చెందిన కొంద‌రు ఎమ్మెల్యేలు దూషించార‌ని, అవ‌మాన‌క‌రంగా వ్యాఖ్య‌లు చేశార‌ని ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబునాయుడు ఆరోపించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న అసెంబ్లీలో ఒక‌ శ‌ప‌థం చేయ‌డం విశేషం.

``ఇది కౌర‌వ స‌భ‌కానీ, గౌర‌వ స‌భ‌కాదు`` అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. స‌భ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత‌.. మీడియాతో మాట్లాడుతూ.. త‌న కుటుంబాన్ని దూషించ‌డం ప‌ట్ల క‌న్నీరు పెట్టుకున్నారు. ఈ ప‌రిణామం రాజ‌కీయంగా తీవ్ర సంచ‌ల‌నం సృష్టించింది. అయినా కూడా మైలేజీ రాలేద‌నే అభిప్రాయం పార్టీలో నెల‌కొంది. మ‌రి వ‌చ్చే ఏడాది అయినా.. పార్టీ పుంజుకుంటుందో లేదో చూడాలి.