Begin typing your search above and press return to search.

కరోనా వేళ... ఆకలి కేకల కలకలం

By:  Tupaki Desk   |   13 May 2020 9:45 AM IST
కరోనా వేళ... ఆకలి కేకల కలకలం
X
ఓ వైపు యావత్తు ప్రపంచ దేశాలను ప్రాణాంతక వైరస్ కరోనా మహమ్మారి వణికించేస్తుంటే... కరోనా కట్టడి కోసం విశ్వవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న వేళ ఎందరో అభాగ్యులు ఆకలి కేకలు పెడుతున్న వైనం తెలియనిదేమీ కాదు. కరోనా కట్టడి కోసమే కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న ఆయా దేశాలు ఆకలి కేకలు పెడుతున్న వారిని ఆదుకునేందుకు పెద్ద ఎత్తున చర్యలు కూడా చేపడుతున్నాయి. అయితే ఈ లాక్ డౌన్ కారణంగానే కాకుండా చాలా కారణాలతో అన్నం లేక ఆకలి కేకలు పెడుతున్న వారి సంఖ్య ఏకంగా 82 కోట్లకు పైగానే ఉందని 2020 గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్ట్ సంచలన విషయాన్ని వెల్లడించింది.

ఈ రిపోర్ట్ ప్రకారం ప్రచంచంలో ఇప్పుడు ఆకలితో అలమటిస్తున్న వారి సంఖ్య 82 కోట్లుగా ఉండగా... ప్రతి 9 మందిలో ఒకరు ఆకలి కేకలు పెడుతూనే ఉన్నారట. ఇందుకు గల కారణాలను కూడా ఆ నివేదిక చాలా కూలంకషంగానే వెల్లడించిందని చెప్పాలి. విశ్వవ్యాప్తంగా ప్రజలు తీసుకుంటున్న ఆహారంలో సరైన పోషకాలు లేని కారణంగానే ఈ ఆకలి కేకలు వినిపిస్తున్నాయట. ప్రాంతం, విద్య, విద్యాస్థాయి, వయస్సు, లింగ వివక్ష పేరిట ప్రపంచ ప్రజల్లో సామాజిక అసమానతలు పెరిగిపోవడం వల్ల పోషక విలువలు హరించుకుపోతున్నాయని ఈ నివేదిక వెల్లడించింది. అంతే కాకుండా సాగులొ వచ్చిన మార్పులు కూడా పోషక విలువల తగ్గుదలకు కారణంగా నిలుస్తోందని సదరు నివేదిక తెలిపింది.

ఇదిలా ఉంటే... ఈ పోషకాహార లోపం కారణంగా చాలా మంది స్లూలకాయం, అధిక బరువుతో సతమతమవుతున్నారని కూడా ఆ నివేదిక తెలిపింది. కరోనాకు ముందే ఈ పరిస్థితి ఇలా ఉంటే.. ఇప్పుడు కరోనా కట్టడి కోసం ఆయా దేశాలు అమలు చేస్తున్న లాక్ డౌన్ కారణంగా ఆకలి కేకలు మరింతగా పెరిగే ప్రమాదం లేకపోలేదని కూడా సదరు నివేదిెక వెల్లడించింది. లాక్ డౌన్ లాంటి ఎలాంటి ఆంక్షలు లేని సమయంలోనే విశ్వవ్యాప్తంగా 82 కోట్ల మంది ఆకలి దప్పులతో అలమటిస్తున్నారంటే.. ఇక కరోనా కట్టడి కోసం అమల్లోకి వచ్చిన లాక్ డౌన్ తో ఇంకెంత మంది ఆ జాబితాలో చేరతారోనన్న అంశం నిజంగానే ఆందోళన కలిగించే అంశమే.