Begin typing your search above and press return to search.

ప్రపంచంలో అతివాదుల పని అయిపోయిందా?

By:  Tupaki Desk   |   8 Nov 2020 12:05 PM IST
ప్రపంచంలో అతివాదుల పని అయిపోయిందా?
X
గడిచిన వందేళ్లలో ఎప్పుడూ జరగని..ప్రపంచం చూడని సిత్రాల్ని 2020 చూపించింది. యావత్ ప్రపంచాన్ని వణికించిన కరోనాతోనే ఈ ఏడాది పుణ్యకాలం మొత్తం గడిచిపోయింది. వందల కోట్ల మంది భయంతో వణికిపోయి.. ఇళ్లలో నుంచి బయటకు రాలేని పరిస్థితి. జీవితంలో మర్చిపోలేని చేదు అనుభవాలకు నెలవుగా మారిన 2020.. చరిత్ర గతిని తిప్పే ఎన్నో అంశాలకు కారణమైందని మాత్రం చెప్పాలి.

గడిచిన కొన్నేళ్లుగా ప్రపంచాన్ని ఏలుతున్న అతివాదులకు చెక్ చెప్పిన ఘనత కూడా 2020 సొంతమని చెప్పాలి. ద్వేషం.. తెంపరితనంతో పాటు.. విలువల పట్ల ఏ మాత్రం గౌరవం లేని వారు.. అధికారం చేతికి రావటం కోసం దేనికైనా సిద్ధమన్నట్లుగా తెగించే అధినేతల తోకల్ని కత్తిరించిన ఘనత 2020దే.

నాలుగేళ్ల క్రితం అమెరికా అధ్యక్షుడిగా ఎంపికైన ట్రంప్ ను చూసి యావత్ ప్రపంచం అచ్చెరువొందింది. ఇలా కూడా జరుగుతుందా? అనుకున్న వారెందరో. ప్రపంచానికే పెద్దన్న అయిన అమెరికా రాజ్యంలో ఓటర్లు ఇలాంటి అధినేతను ఎంచుకున్నారా? అని ఆశ్చర్యపోయినోళ్లు చాలామందే ఉన్నారు. అలాంటి ట్రంప్ నకు చెక్ పెట్టింది 2020. అంతేనా.. ప్రపంచానికి తరచూ మూడో ప్రపంచ యుద్ధాన్ని గుర్తుకు తెస్తూ..తన మాటలతో వెన్నులో జలదరింపు తెచ్చిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్.. కన్నీళ్లు పెట్టుకున్నది కూడా ఈ ఏడాదిలోనే.

నరరూప రాక్షసుడిగా.. అలాంటి నియంతను నాగరిక సమాజం చూడలేదన్న కొరతను తీర్చేసిన అతడు.. చావు దగ్గరకు వెళ్లి వచ్చారంటారు. రష్యా అధ్యక్షుడిగా పవర్ ను చేతిలోకి తీసుకొని.. తాను తప్పితే మరెవరూ ఆ కుర్చీలో కూర్చోకూడదన్న మొండితనం వాద్లిమర్ పుతిన్ సొంతం. అలాంటి అధినేత నోటి నుంచి రాజీనామా చేస్తానని చెప్పేలా చేసింది 2020. తీవ్రమైన అనారోగ్యానికి గురైనట్లుగా చెబుతారు. అంతేకాదు.. ప్రపంచానికి కాబోయే సూపర్ పవర్ అన్న మాట కోసం తహతహలాడే చైనా గర్వాన్ని.. అధిక్యతను ప్రశ్నించి.. ప్రపంచం ముంందు వారెలాంటివారన్న విషయాన్ని చెప్పటమే కాదు.. భారత్ ను చిన్నచూపు చూస్తే.. షాకులు తప్పవన్న విషయాన్ని స్పష్టం చేసిన ఘనత కూడా 2020దే. మరో యాభైలే ఉన్న(సుమారు) 2020లో మరెన్ని సిత్రాలు చోటు చేసుకోనున్నాయో చూడాలి.